Share News

Chhasttisgarh Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Nov 28 , 2025 | 08:43 PM

ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతూ అలియాస్ శ్యామ్ దాదా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.

Chhasttisgarh Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు
Maoists Shyam Dada surrenders

ఇంటర్నెట్ డెస్ట్: ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక మావోయిస్టు నేత లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతూ అలియాస్ శ్యామ్ దాదా సహా పది మంది మావోయిస్టులు భద్రతాదళాల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. శ్యామ్ దాదాపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టేసేందుకు 2013లో జరిగిన దాడిలో శ్యామ్ దాదా మాస్టర్‌మైండ్‌ అని అధికారదస్త్రాలు చెబుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) దర్భా డివిజన్‌కు కొన్నేళ్ల పాటు శ్యామ్ దాదా నేతృత్వం వహించారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో శ్యామ్ ఒకరని పోలీసులు తెలిపారు.


శ్యామ్ దాదాతో పాటు డివిజనల్ కమిటీ మెంబర్ సరోజ్ అలియాస్ ఊర్మిళ (రూ.8 లక్షల రివార్డు), ఏరియా కమిటీ మెంబర్లు భూపేష్ అలియాస్ సహాయక్ రామ్, ప్రకాశ్, కమలేష్ అలియాస్ ఝిత్రూ, జనని అలియాస్ రైమతి కశ్యప్, సంతోష్ అలియాస్ సన్నూ, నవీన్, పార్టీ మెంబర్లు రామ్‌షీలా, జయంతి కశ్యప్‌లు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సుఖ్మాలో సీనియర్ పోలీసులు, జిల్లా అధికారుల ముందు వారు ఆయుధాలను త్యజించారని చెప్పారు.

డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా దళాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరుగుతున్న నక్సల్స్ ఏరివేత చర్యలు, పలువురు సీనియర్ మావోయిస్టు నేతల లొంగుబాటు, ప్రభుత్వం పదే పదే చేస్తున్న సూచనలు ఈ పది మంది లొంగుబాటుకు దారితీశాయని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు

పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2025 | 09:26 PM