Kerala Nuns: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కేరళ నన్స్‌కు బెయిల్
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:20 PM
మానవ అక్రమ రవాణా, మత మార్పిడి ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన కేరళకు చెందిన ఇద్దరు క్రిస్టియన్ నన్స్‌కు స్థానిక బిలాస్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143, ఒరిస్సా మత స్వేచ్ఛా చట్టం..

బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), ఆగస్టు 2 : ఛత్తీస్‌ఘఢ్‌లోని బిలాస్‌పూర్‌లో మానవ అక్రమ రవాణా, మత మార్పిడి ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన కేరళకు చెందిన ఇద్దరు క్రిస్టియన్ నన్స్‌కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 143, ఒరిస్సా మత స్వేచ్ఛా చట్టం, 1967లోని సెక్షన్ 3 కింద నన్స్ మీద కేసు నమోదు చేశారు.
అయితే, నన్స్ మీద పెట్టిన BNS సెక్షన్ 143 మానవ అక్రమ రవాణా కేసు.. నన్స్ విషయంలో వర్తించదని కోర్టులో వాదించామని, దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఇద్దరు నన్స్‌కి ఈరోజు(శనివారం) బెయిల్ మంజూరు చేసిందని నన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాది గోప కుమార్ చెప్పారు. అయితే, వీరిద్ధరూ దేశం విడిచి వెళ్లరాదని, ఒక్కొక్కరికి రూ. 50,000 బెయిల్ బాండ్ అందించాలని కోర్టు నిబంధనలు పెట్టిందని ఆయన తెలిపారు.
ఈ కేసు డీల్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరపున వాదిస్తున్న న్యాయవాది కూడా బెయిల్ ఇచ్చిన విషయాన్ని ధృవీకరించారు. అయితే, కోర్టు ఇచ్చిన 'బెయిల్ ఆర్డర్'లో ఇద్దరు నన్స్ భారతదేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదు అనే షరతులు కోర్టు విధించిందని ఎన్ఐఏ న్యాయవాది చెప్పారు. బెయిల్ మంజూరుకు సంబంధించి తమకు కోర్టు ఉత్తర్వు అందిందని, దానిని సవివరంగా అధ్యయనం చేస్తామని NIA న్యాయవాది తెలిపారు.
కాగా, నిన్న (శుక్రవారం) ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలోని ప్రత్యేక NIA కోర్టు ఈ కేసులో ఇద్దరు నన్స్ సహా ముగ్గురు వ్యక్తుల బెయిల్ దరఖాస్తును స్వీకరించింది. కోర్టు తన తీర్పును నేటికి(శనివారానికి) రిజర్వ్ చేసింది. నిందితులు బలవంతంగా మత మార్పిడికి లేదా మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని డిఫెన్స్ న్యాయవాది వాదించారు.
జూలై 25న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో కేరళకు చెందిన నన్స్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్ట్ ను కేరళలోని, అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రెండూ ఖండించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిజెపి ప్రభుత్వం మత స్వేచ్ఛను దెబ్బతీస్తోందని ఆరోపించాయి. ఈ అరెస్టును అన్యాయమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. సదరు నన్స్ కొంతమంది గిరిజన బాలికలకు ఉపాధి కల్పించేందుకు కేరళకు తీసుకెళ్తున్నారని ఆయన చెప్పారు. దీనిని చూసిన బజరంగ్ దళ్ సభ్యులు అపోహ పడి పోలీసులకు ఫిర్యాదు చేశారని థరూర్ అన్నారు. ఇది సరైందికాదన్న శశిథరూర్.. ఎవరూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పుడు, వారిని వారం రోజులుగా జైలులో ఉంచారన్నారు. వారికి బెయిల్ ఇప్పించడానికి తాము ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తామని అటు, బిజెపి కేరళ యూనిట్ కూడా చెబుతోందని థరూర్ గుర్తు చేశారు.