Share News

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:04 AM

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ‘పీఎం ధన ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది.

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

  • కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం

  • దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు

  • ఏడాదికి 24 వేల కోట్ల కేటాయింపు ఉత్పాదన, రుణ సౌలభ్యం పెంపు లక్ష్యం

  • 1.7 కోట్ల రైతులకు ప్రయోజనం

  • రేపు రైతుల ఖాతాల్లోకిపీఎం కిసాన్‌!

  • బిహార్‌లో విడుదల చేయనున్న మోదీ

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ‘పీఎం ధన ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఏడాది రూ.24 వేల కోట్లు కేటాయించి, దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఆరేళ్ల పాటు అమలు చేయనున్నారు. ఉత్పాదకతను పెంచడం, సుస్థిర వ్యవసాయ విధానాలు, ఎక్కువ మంది పంటల మార్పిడి విధానాన్ని అనుసరించేలా చూడడం ఈ పథకం లక్ష్యం. పీఎం ధన ధాన్య కృషి యోజన ద్వారా కోటీ 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.


అక్టోబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. పంటల ఉత్పాదకత, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఈ పథకం అమలుకు ఎంపిక చేస్తారు. ఇందులో రాష్ట్రానికి ఒక జిల్లా తప్పనిసరిగా ఉంటుంది. కాగా, పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీ పెట్టుబడి పరిమితిని రూ.20 వేల కోట్లకు పెంచేందుకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో 2032 నాటికి ఎన్టీపీసీ 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధిస్తుందని అంచనా.

Updated Date - Jul 17 , 2025 | 06:04 AM