Gujarat: ప్రేమ పాశమే.. యమపాశమై!
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:04 AM
కొద్దిసేపట్లో వేద మంత్రాలు.. కుటుంబ పెద్దలు, బంధు మిత్రుల సాక్షిగా.. తాళి కట్టి.. ప్రేమించిన సహచరిని జీవిత భాగస్వామిగా చేపట్టాల్సిన...
ముహూర్తానికి ముందే వధువును చంపిన వరుడు
చీర విషయమై గొడవ.. వరుడు రౌడీషీటర్
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఘటన
భావ్‌నగర్, నవంబరు 16: కొద్దిసేపట్లో వేద మంత్రాలు.. కుటుంబ పెద్దలు, బంధు మిత్రుల సాక్షిగా.. తాళి కట్టి.. ప్రేమించిన సహచరిని జీవిత భాగస్వామిగా చేపట్టాల్సిన వ్యక్తే కడతేర్చిన ఘటన గుజరాత్‌లోని జిల్లా కేంద్రమైన భావ్‌నగర్ నగరం టెక్రీచౌక్ ప్రాంతంలో శనివారం జరిగింది. సాజన్ బారయ్య (26) అనే యువకుడితో ప్రేమలో పడిన సోనీబెన్ రాథోడ్ (22).. అతడి కోసం కుటుంబాన్ని వదిలిపెట్టింది. ఇద్దరూ 8 నెలలు సహ జీవనం చేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో దాంపత్య జీవితంలో అడుగు పెట్టాలనుకున్నారు. ఈ నెల 15న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అందమైన జీవితంపై కలలు కన్న సోనీబెన్ పెళ్లికి ముందు ఘనంగా జరిగిన మెహిందీ వేడుకలో ఒక చేతిపై ‘సాజన్’, మరో చేతిపై ‘సదా సౌభాగ్యవతి భవ్’ అని రాసుకున్నారు. చివరకు ముహూర్తం వేళ సోనీబెన్ రాథోడ్ కట్టుకునే చీరతోపాటు డబ్బు విషయంలో వధూవరుల మధ్య మాటా మాటా పెరిగింది. ఆ కోపంలో వధువు సోనీ తలపై పైపుతో కొట్టిన సాజన్.. గోడకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందాక పరారయ్యాడు. సాజన్‌పై హత్యాయత్నం, దోపిడీ, భౌతిక దాడి తదితర కేసులతో రౌడ్ షీట్ కూడా ఉండటం గమనార్హం.