ఓటర్ల జాబితాలో నా పేరూ తీసేశారు: తేజస్వి
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:30 AM
బిహార్‌లో చేపట్టిన ఓటర్ల రీ సర్వేపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. రీ సర్వే అనంతరం శుక్రవారం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును తీసేశారని ఆరోపించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల రీ సర్వేపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. రీ సర్వే అనంతరం శుక్రవారం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును తీసేశారని ఆరోపించారు. శనివారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. ఫొటో గుర్తింపు కార్డులో ఉన్న ఎపిక్ నెంబర్‌ను ఎన్నికల సంఘం అధికారిక యాప్‌లో నమోదు చేసిన తేజస్వి.. జాబితాలో తన ఓటుకు సంబంధించిన వివరాలు తీసేశారని పేర్కొన్నారు. ‘ఎలాంటి రికార్డులు లేవు.’ అని ఉన్న సందేశాన్ని చూపించారు. ‘‘జాబితాలో నా పేరు లేదు. ఎన్నికల్లో నేనెలా పోటీ చేయగలను?.’’ అని ప్రశ్నించారు. తేజస్వి ఆరోపణలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఎలక్టోరల్ జాబితాలోని ఓ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి.. పట్నాలోని వెటర్నరీ కాలేజీ పోలింగ్ బూత్ పరిధిలో తేజస్వికి ఓటు హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆయన చేసిన ఆరోపణలు దుర్మార్గపూరితమైనవని, నిరాధారమని దుయ్యబట్టింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబరు 416లో తేజస్వి పేరు, వివరాలు ఉన్నాయని వివరించింది.