Bengaluru Road Rage Incident: బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:35 AM
బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. బైకర్ తనపై అకారణంగా దాడి చేశాడని అధికారి వీడియో రిలీజ్ చేయగా.. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు ఉన్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది రోడ్ రేజ్ ఘటన అని పోలీసులు తెలిపారు. భాష, ప్రాంతీయత కోణాలు లేవని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఇటీవల జరిగిన ఎయిర్‌ఫోర్స్ అధికారిపై దాడి ఘటనలో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అధికారి కూడా స్థానికుడితో బాహాబాహీకి దిగిన దృశ్యాలు సంచలనంగా మారాయి. ఈ వీడియోపై డీసీపీ (ఈస్ట్) డీ దేవరాజ్ కూడా స్పందించారు. ఇది కన్నడిగులు, రాష్ట్రేతరుల మధ్య ఘర్షణ కాదని అన్నారు. విచక్షణ కోల్పోయి బాహాబాహీకి దిగారని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి తొలుత వింగ్ కమాండర్ శీలాదిత్య బోస్ వీడియో పోస్టు చేశారు. తాము కారులో వెెళుతుంటే ఓ బైకర్ సడెన్‌గా వచ్చి తమను అడ్డుకున్నాడని, కన్నడలో దుర్భాషలాడాడని తెలిపారు. తన కారుపై డీఆర్‌డీఓ స్టికర్ చూసి రెచ్చిపోయాడని, తన భార్యతోనూ దురుసుగా ప్రవర్తించడంతో తాను తట్టుకోలేకపోయానని అన్నారు. ఈ క్రమంలో బైకర్ తనను రక్తం కారాలే కొట్టాడని అన్నారు. ముఖం, మెడపై రక్తమోడుతున్న దృశ్యాన్ని షేర్ చేశారు. బోస్ భార్య ముధుమితా ఆయనను కారులో ఎయిర్‌పోర్టుకు తీసుకెళుతుండగా ఉదయం పూట ఈ ఘటన జరిగింది. తన భార్య తనను పక్క తీసుకొచ్చేసిందని ఆ తరువాత తాము పోలీసుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన స్పందన లేదని బోస్ అన్నారు. ‘‘కర్ణాటక ఇలా అయిపపోయిందేమిటీ.. ఇది నమ్మశక్యంగా లేదు. దేవుడే ఇక మనల్ని కాపాడాలి. లా అండ్ ఆర్డర్ మాకు అండగా నిలవకపోతే మేము ప్రతిఘటించాల్సి ఉంటుంది’’ అని వింగ్ కమాండర్ తన వీడియోలో చెప్పుకొచ్చారు. అసలు వారి మధ్య ఘర్షణ ఎందుకు మొదలైందో మాత్రం తెలియరాలేదు.
ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో బైకర్ వికాస్ కుమార్, ఎయిర్‌ఫోర్సు అధికారి బోస్ ఇద్దరు పరస్పరం బాహాబాహీకి దిగినట్టు కనిపించింది. బోస్ బైకర్‌ను తోసి ఆ తరువాత అతడి మెడ పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన భార్య మధుమిత భర్తను అడ్డుకుంటున్నట్టు వీడియోలో కనిపించింది. స్థానికులు ఎయిర్ ఫోర్స్ అధికారికి ఏదో చెబుతూ గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆఫీసర్ బైకర్‌పై చేయి చేసుకున్న తరువాత అతడు ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుగా కూడా వీడియోలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించి బయటపడ్డ నాలుగు సీసీటీవీ ఫుటేజీల్లోనూ బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు కనిపించింది.
అయితే, బైకర్ రాయి తీసుకుని తాను కారు అద్దం పగలగొట్టే ప్రయత్నం చేశాడని, తనను కొట్టాడని అన్నారు. అక్కడున్న వారు తమను దుర్భాషలాడారని ఎయిర్ ఆఫీసర్ బోస్ చెప్పుకొచ్చారు. బైకర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన కారును ఢీకొట్టబోయాడని స్వాడ్రన్ లీడర్ మధుమిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కారు దిగగా బైకర్ తన భర్తను రాయితో కొట్టాడని, ‘‘మీరు డీఆర్‌డీఓ, నాకు స్టిక్కర్ కనిపిస్తోంది. మీ సంగతి చూస్తా’’ అని అన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త మళ్లీ కారులో కూర్చున్నా బయటకు లాగారని, చుట్టుపక్కల వారు కూడా దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
ఇది రోడ్ రేజ్ ఘటన అని డీసీపీ దేవరాజ్ తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ భార్య కారు నడుపుతుండగా ఆయన పక్క సీటులో కూర్చున్నట్టు తెలిపారు. ముఖంపై రక్తమోడుతుండగానే వారు ఫిర్యాదు చేసేందుకు రాగా ముందు ఫస్ట్ ఎయిడ్ తీసుకుని రావాలని తాము సూచించామని అన్నారు. ఆ తరువాత డీఆర్‌డీఓను సంప్రదించగా మధుమిత వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసినట్టు తెలిపారు.
తాను వారి కారు పక్కనుంచి వెళుతుండగా మధుమిత ఏదో అన్నారని, ఆమె ఏమంటున్నారని భర్తను అడిగిన క్రమంలో వాగ్వాదం మొదలైందని బైకర్ చెప్పినట్టు కూడా పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి
ఈసీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రిషీకేశ్‌లో రాఫ్టింగ్.. గంగానదిలో పడి యువకుడి దుర్మరణం