Bengaluru Professor Assaulted: రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు ప్రొఫెసర్‌పై దాడి.. బెంగళూరులో షాకింగ్ ఘటన
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:16 PM
కారులో వెళుతూ రోడ్డుపై చెత్త వేసిన ముగ్గురు వ్యక్తులను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారంటూ బెంగళూరులోని ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది.

బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డు మీద చెత్త వేయొద్దన్నందుకు ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ముఖంపై ముష్టిఘాతాలు కురిపించడంతో ఫ్రాక్చర్ అయ్యిందని ఆయన అన్నారు.
దయానంద్ సాగర్ కాలేజీ ప్రొఫెసర్ అరొబిందో గుప్తా అసలేం జరిగిందీ మీడియాకు తెలిపారు. ‘‘బైక్‌పై వెళుతున్న నేను టీ కోసం రోడ్డు పక్కన ఆగాను. అక్కడ నిలిపి ఉన్న కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని కనిపించారు. నేను బయలుదేరిన తరువాత వారు నన్ను ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై చెత్త వేశారు. వాళ్లు వేగంగా వెళ్లడంతో నా బైక్ దాదాపుగా జారింది. వారు నెమ్మదించిన తరువాత నేను వెళ్లి రోడ్డుపై చెత్త వేయొద్దని అన్నాను. ఆ తరువాత ముందుకు వెళ్లిపోయాను. కానీ వాళ్లు నా బైక్ ఆపి చేయి చేసుకోవడం ప్రారంభించారు. ఇద్దరు నన్ను బలవంతంగా నేలపై అదిమి పెట్టగా మూడో వ్యక్తి ముష్టిఘాతాలు కురిపించాడు’’ అని సదరు ప్రొఫెసర్ ఆరోపించారు.
ఘటనా స్థలం నుంచే తాను పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ దాడిలో తన కంటి కింది ఎముక, ముక్కు విరిగాయని తెలిపారు.
కాగా, నిన్న ఉదయం మరో ఘటనలో ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి, స్థానిక బైకర్ ఘర్షణ పడిన విషయం తెలిసిందే. తాము కన్నడిగులము కానందున బైకర్ రెచ్చిపోయాడని, రక్తం కారేలా కొట్టాడని తొలుత ఎయిర్‌ఫోర్స్ అధికారి శీలాదిత్య పేర్కొన్నాడు. అయితే, తదనంతం వైరల్ అయిన వీడియోల్లో ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా బైకర్ కూడా ఎయిర్‌ఫోర్స్ అధికారిపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనల తాలూకు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి