Man Assasinates Younger Brother: తమ్ముడిని చంపిన అన్న .. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:10 AM
ఓ అన్న తన తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కారులోనే ప్రాణం తీశాడు. శవాన్ని బెంగళూరులోని చెరువులో పడేశాడు.
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ అన్న తన తమ్ముడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. శవాన్ని కారులో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. తమ్ముడి ప్రవర్తన నచ్చక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కలబురిగి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ధనరాజ్ నేర ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులను బాగా హింసించే వాడు. అన్న శివరాజ్‌ను కూడా కొట్టేవాడు. దొంగతనాలు, తాగుడు, గొడవలతో కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చాడు.
పొరుగు ఇళ్లలో కూడా దొంగతనాలు చేసేవాడు. మొబైల్ ఫోన్స్, మేకలు, కోళ్లు దొంగలించేవాడు. బాధితులు తరచుగా ధనరాజ్ తల్లిదండ్రులకు దీనిపై కంప్లైంట్ చేసేవారు. తమ్ముడి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవటంతో శివరాజ్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా తమ్ముడిని అంతం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం మరో ఇద్దరి సాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం నవంబర్ 2వ తేదీన శివరాజ్ తన తమ్ముడిని కారులో బెంగళూరుకు తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో కారులోనే ముగ్గురు కలిసి ధనరాజ్‌ను చంపేశారు.
శవాన్ని బెంగళూరులోని ఓ చెరువులో పడేసి ఊరికి వెళ్లిపోయారు. నవంబర్ 6వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో శవం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెరువుకు దగ్గరలో ఉన్న ఓ కంపెనీ సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరీక్షించగా కారు సంగతి బయటపడింది. ఆ కారు నెంబర్ ప్లేటు ఆధారంగా శివరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. పోలీసులు శివరాజ్‌తో పాటు మిగిలిన ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కుటుంబంతో కలిసి భోజనం తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు