Plane Crash Claims : భారతదేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద బీమా క్లెయిమ్
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:04 PM
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు భీమా కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్‌లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు..

ఇంటర్నెట్ డెస్క్:గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దశాబ్దకాలంలో ఎన్నడూ చూడనంత పెద్దది. అది మాత్రమే కాదు, ఈ ప్రమాదం ద్వారా బీమా కంపెనీలు చెల్లించాల్సిన క్లెయిమ్‌ల మొత్తం కూడా అంతే భారీగా ఉండబోతోంది. భారతదేశంలో జరిగిన ఈ అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఏవియేషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమనే షాక్‌లోకి నెట్టింది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్‌లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు $475 మిలియన్లు లేదా ₹39.4 బిలియన్లు(సుమారు రూ. 4వేల కోట్లు)గా అంచనా వేస్తున్నారు.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ఈ క్లెయిమ్ మీద స్పందించారు. 'ఈ ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ భారతదేశ చరిత్రలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు' అని ఆయన అన్నారు. ఇక, క్లెయిమ్‌ల చెల్లింపుల విషయానికొస్తే మొదట బీమాదారుల హల్ క్లెయిమ్‌ను పరిష్కరిస్తారు. తరువాత ఇతర క్లెయిమ్‌ల వంతు. అయితే, వీటన్నింటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని నారాయణన్ చెప్పారు.
నారాయణన్ చెబుతున్నదాని ప్రకారం, విమాన హల్(విమానంలోని కీలకమైన అన్ని భాగాలు), ఇంజిన్ కోసం క్లెయిమ్ దాదాపు $125 మిలియన్లు లేదా ₹10.44 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ప్రయాణీకులు, ఇతరుల ప్రాణనష్టానికి అదనపు బాధ్యత క్లెయిమ్‌లు దాదాపు $350 మిలియన్లు లేదా ₹29.23 బిలియన్లు ఉంటుందని లెక్కకడుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం 2023లో భారతదేశంలో విమానయాన పరిశ్రమ చెల్లించిన వార్షిక ప్రీమియం కంటే ఈ క్లెయిమ్ మూడు రెట్లు ఎక్కువ.
ఈ పరిస్థితుల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా క్లెయిమ్స్ చెల్లించి రావడంతో ఇది మొత్తం ప్రపంచ విమానయాన పునఃభీమా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఇది భారతదేశంలోని విమానయాన సంస్థలకు బీమాను మరింత ఖరీదైనదిగా చేసే అవకాశం ఉందని సదరు సంస్థ అంటోంది. విమానయాన పరిశ్రమ అంతటా బీమా ప్రీమియంలు తక్షణం లేదా పాలసీ పునరుద్ధరణ సమయంలో పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎయిర్ ఇండియాకు కవరేజ్ అందించిన సంస్థలలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి.
ఇవి కూడా చదవండి
లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్
నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం
Read Latest AP News And Telugu News