AI Vienna Flight: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానంలో కలకలం
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:07 PM
జూన్ 14 వియన్నాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దిగిపోవడం కలకలం రేపింది. పైలట్‌లు పరిస్థితిని వెంటనే చక్కదిద్దడంతో గమ్యస్థానానికి యథాప్రకారం చేరుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: మరో ఎయిర్ ఇండియా విమానం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి వియన్నాకు బయలుదేరిన విమాన ఎత్తుస్థాయి టేకాఫ్ అయిన కొంతసేపటికే ఒక్కసారిగా దిగిపోవడం కలవరం సృష్టించింది. వెంటనే పైలట్‌లు పరిస్థితిని చక్కదిద్దడంతో యథా ప్రకారం విమానం గమ్యస్థానానికి చేరింది. జూన్ 14న ఈ ఘటన జరిగిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తాజాగా వెల్లడించారు. అసలేం జరిగిందో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభమైందని చెప్పారు. కారణం తెలిసే వరకూ పైలట్‌లను విధుల రోస్టర్ నుంచి తప్పించినట్టు తెలిపారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియన్నాకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణిస్తున్న విమానం ఎత్తుస్థాయి హఠాత్తుగా కిందికి దిగింది. ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా దిగిపోవడంతో స్టాల్, గ్రౌండ్ ప్రాక్సిమిటీ అలర్ట్‌లు జారీ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్‌లు పరిస్థితిని చక్కదిద్దారు. విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లారు. ఆ తరువాత ప్రతికూల వాతావరణం ఎదురైనా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు.
‘ఈ విషయమై పైలట్ నుంచి సమాచారం అందగానే నిబంధనల మేరకు డీజీసీఏకు ఈ విషయాన్ని తెలియజేశాం. విమానంలోని రికార్డర్లు వచ్చాక ఘటనపై దర్యాప్తు ప్రారంభించాం. ఈ నేపథ్యంలో పైలట్‌ను ఆఫ్ రోస్టర్‌పై ఉంచాం’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఎయిర్ ఇండియా భద్రతా విభాగం అధిపతిని ఆదేశించింది.
ఇక ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన ఉదంతాలు ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనలకు కారణాలేవో తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 23న ఎయిర్ ఇండియాకు చెందిన గురుగ్రామ్ బేస్‌లో విస్తృత చెకింగ్ నిర్వహించింది.
ఇవి కూడా చదవండి:
ఎయిర్ ఇండియా, బోయింగ్‌లపై న్యాయపోరాటం.. విమాన ప్రమాద బాధితుల నిర్ణయం
అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి