Share News

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 07:33 AM

Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
Air India Plane Crash

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగి ఈ రోజుతో సరిగ్గా నెల రోజులు అయింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. శనివారం విడుదలైన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.


ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్‌పిట్‌లో ఉన్న రికార్డర్‌లో బయటపడింది. ఆ సంభాషణను బట్టి చూస్తే.. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. ఓ పైలట్ దానిపై స్పందిస్తూ..‘ఎందుకు ఆపు చేశావు?’ అని అని అడిగాడు. మరొక పైలట్ తానలా చేయలేదని చెప్పాడు. అయితే, ప్రమాదం జరిగిన రోజు బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 - 8కు ఏమైంది అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇంధన సరఫరా ఆగిపోయిన కొన్ని క్షణాలకే ఓ పైలట్ మేడే అలర్ట్ ఇచ్చాడు.


ఈ నేపథ్యంలోనే ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ ఆ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది. కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోయింది. విమానంలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు ఉండటంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. విమానంలోని వారు, కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థులు, నేలపై ఉన్నవారు కూడా కాలి బూడిదయ్యారు. పైలట్ పొరపాటున విమానానికి ఇంధన సరఫరా ఆపేశాడా? లేక దానంతట అదే ఆగిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది.


1980లో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ పైలట్ విమానం గాల్లో ఉండగా ఇంధన సరఫరాను పొరపాటున నిలిపివేశాడు. విమానం గాల్లో చాలా ఎత్తులో ఉండటంతో మళ్లీ ఇంధన సరఫరాను కొనసాగించడానికి సమయం దొరికింది. పెను ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మాత్రం.. విమానం చాలా తక్కువ ఎత్తులో వెళుతోంది. ఇంధన సరఫరాను మళ్లీ కొనసాగించేంత సమయం లేకపోయింది. విమానం కేవలం 32 సెకన్లు మాత్రమే గాల్లో ఉంది. తర్వాత కిందపడి పేలిపోయింది.


ఇవి కూడా చదవండి

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండ

Updated Date - Jul 12 , 2025 | 10:13 AM