NDAs Bihar Election Sweep: 5ఎన్డీయే విజయానికి మెట్లు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:37 AM
సాధారణంగా ఐదేళ్లపాటు పరిపాలించిన ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది! అలాంటిది 2014-15 నడుమ కొంతకాలం తప్ప 2005 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు...
సంక్షేమ పథకాలతో.. భారీగా పడ్డ మహిళల ఓట్లు
న్యూఢిల్లీ, నవంబరు 14: సాధారణంగా ఐదేళ్లపాటు పరిపాలించిన ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది! అలాంటిది 2014-15 నడుమ కొంతకాలం తప్ప 2005 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు (కూటములు మారుతూ) నితీశే అధికారంలో ఉన్నా.. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు రాలేదు? అంటే.. అందుకు ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు! అవేంటంటే..
సాఫీగా సీట్ల సర్దుబాటు: ఎన్నికలకు చాలాకాలం ముందే ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగిపోయింది.
మహిళలు-ఈబీసీల ఓట్లు: ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో పురుషులతో (62.8ు) పోలిస్తే ఓటేసిన మహిళల శాతం (71.6ు) దాదాపు 9 శాతం ఎక్కువ. ఏడు జిల్లాల్లో ఆ తేడా దాదాపు 14ు ఉంచి 20ు దాకా కూడా ఉండడం గమనార్హం. వీటిలో ఎక్కువ శాతం ఎన్డీయే కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ముఖ్యంగా.. ఎన్నికలకు ముందు ఆగస్టు 29న నితీశ్ సర్కారు ప్రకటించిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. ఆ పథకం కింద.. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు వ్యాపారం చేసుకోవడానికి సీడ్‌మనీ కింద రూ.10 వేలు చొప్పున పంపిణీ చేశారు. 1.4 కోట్ల మంది బిహారీ మహిళలకు ఈ సొమ్ము సరిగ్గా ఎన్నికలకు ముందు అందింది. అలాగే.. బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, యూనిఫారాల వంటి పథకాలు, వితంతు పింఛన్ల పెంపు వంటి పథకాలతో మహిళల ఓట్లు పెద్ద ఎత్తున ఎన్డీయేకిపడ్డాయి.
ఎంవై వర్సెస్ ఎంఈ: ముస్లింలు, యాదవుల(ఎంవై) ఓట్లపై కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గట్టిగా నమ్మకం పెట్టుకుంటే.. వారికి దీటుగా ఎన్డీయే కూటమి ఎంఈ(మహిళలు-ఈబీసీలు) మంత్రాన్ని పఠించింది. బీజేపీ ఒకవైపు సంప్రదాయ అగ్రకులాలవారి ఓట్లపై దృష్టి సారించగా.. జేడీయూ కుర్మీలు, ఈబీసీల ఓట్లపై దృష్టి సారించింది (బిహార్‌లో ఈ రెండు వర్గాల ఓట్లే 36ు దాకా ఉంటాయి). మరోవైపు.. కూటమిలోని లోక్‌జనశక్తి, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీలు దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టడంలో కీలకపాత్ర పోషించాయి. సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల ఓట్లు అత్యధికంగా మజ్లిస్ పార్టీకే పడ్డాయి. ముస్లిం ఓట్లలో చీలిక.. మహాగఠ్‌బంధన్‌కు బలమైన పట్టున్న ప్రాంతాల్లో కూడా ఓటమికి కారణమైంది. ఆర్జేడీకి కోర్ ఓట్ బ్యాంకు అయిన యాదవుల ఓట్లు సైతం ఈసారి చీలి.. కొందరు ఎన్డీయేవైపు మొగ్గుచూపినట్టు సమాచారం.
తొలగని జంగిల్‌రాజ్ భయం: బిహార్ ఓటర్లలో చాలామందికి.. ఒకప్పటి జంగిల్ రాజ్ భయం ఇంకా తొలగిపోలేదు. బిహారీలనగానే ఇతరప్రాంతాల్లో ఒకప్పుడు చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని.. నితీశ్ పాలనతో ఆ మరక పోయి, బిహార్‌ను గౌరవంగా చూస్తున్నారనే భావన చాలా మంది బిహారీల్లో ఉంది. అందుకే.. అధికారం కోసం ఎవరితోనైనా అంటకాగే ‘పల్టూరామ్’ అనే అపప్రథ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఉన్నప్పటికీ ఓటర్లు దాన్ని పట్టించుకోలేదు.
మోదీ మ్యాజిక్
ఎప్పటిలాగానే ఈసారి కూడా బిహార్‌లో మోదీ మ్యాజిక్ కొనసాగింది. ఆయన సభలు, సంక్షేమ పథకాలు.. తటస్థంగా ఉన్న ఓటర్లను ఎన్డీయే వైపు సంఘటితం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 13 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పట్నాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. చొరబాటుదారులకు ఆర్జేడీ-కాంగ్రెస్ మద్దతు ఉందని.. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకుతిన్నాయని, ఆటవిక పాలన కొనసాగించాయని పదేపదే గుర్తుచేశారు. రాష్ట్రంలోని పెద్దలందరూ ఆర్జేడీ పాలనలో సాగిన అరాచకాల గురించి ఈ తరం యువతకు తెలపాలని పిలుపునిచ్చారు. దీనిపై విస్తృతంగా జరిగిన చర్చ ఓటర్లపై బాగా ప్రభావం చూపింది.