Bharat Bandh 2025: దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..
ABN , Publish Date - Jul 09 , 2025 | 10:27 AM
Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్ యూనియన్ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్ యూనియన్లకు రైతు సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని బహిష్కరించినట్లు సమాచారం. ఇక, కేరళలో బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, షాపులు మూతపడ్డాయి. కోయికోడ్, మలప్పరం, కన్నూర్, కాసర్‌గడ్‌లలో బంద్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. రోడ్లు మొత్తం నిర్మానుషంగా మారాయి. ఒడిశా రాష్ట్రంలో సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.9 వేలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిరసనకారులు ఓ చోట రోడ్డుపై దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మిద్నాపూర్ బస్ట్ స్టేషన్‌ను సైతం ముట్టడించారు.
బీహార్‌లో అయితే ఏకంగా రైల్వే ట్రాకులపైకి వచ్చి మరీ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జేడీ శ్రేణులు దర్భంగాలో నమో భారత్ రైలును ఆపేశాయి. ఇక, ముంబైలో భారత్ బంద్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలలో ట్రేడ్ యూనియన్ల బంద్ ప్రభావం అంతగా కనిపించటం లేదు.
బంద్‌లో పాల్గొన్న 10 ట్రేడ్ యూనియన్లు..
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU)
హింద్ మజ్దూర్ సభ (HMS)
ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (AIUTUC)
సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA)
ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (AICCTU)
ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (TUCC)
లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)
యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)
ఇవి కూడా చదవండి
8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..
మర్డర్ కేసు.. నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి.