MM Hills Sanctuary: కలకలం రేపుతున్న వన్యప్రాణుల వరుస మరణాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:28 PM
MM Hills Sanctuary: తల్లి పులి మీన్యం ఫారెస్ట్ ఏరియా నుంచి గ్రామంలోకి వచ్చింది. ఓ ఆవును వేటాడి చంపి, అడవిలోకి తీసుకెళ్లింది. తల్లి పులి, పిల్ల పులులు ఆ మాంసాన్ని తిన్నాయి.

కర్ణాటకలో వన్య ప్రాణుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి పెద్ద సంఖ్యలో వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా, హనుమంతపుర గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏకంగా 20 జాతీయ పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో 3 మగ నెమళ్లు కాగా, మిగిలిన 17 ఆడ నెమళ్లు. నెమళ్ల కళేబరాలను గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కళేబరాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ టెస్టులో నెమళ్ల మరణానికి కారణం ఏంటో తెలిసే అవకాశం ఉంది. కాగా, గత జూన్ నెలలో మలె మహదీశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ సాంక్షరీలో తల్లి పులి, నాలుగు పిల్ల పులులు చనిపోయి కనిపించాయి. వాటి మృతి అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో విష ప్రయోగం చేయబడిన ఆవు మాంసాన్ని తినటం వల్ల అవి చనిపోయినట్లు తేలింది. ఫారెస్ట్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం..
తల్లి పులి మీన్యం ఫారెస్ట్ ఏరియా నుంచి గ్రామంలోకి వచ్చింది. ఓ ఆవును వేటాడి చంపి, అడవిలోకి తీసుకెళ్లింది. తల్లి పులి, పిల్ల పులులు ఆ మాంసాన్ని తిన్నాయి. గ్రామస్తులు ఆ ఆవు కళేబరాన్ని గుర్తించారు. పులిని చంపాలన్న కోపంతో వారు ఆవు మాంసంపై విషం చల్లారు. విషం కలిపిన ఆవు మాంసాన్ని తిని తల్లి పులి, పిల్ల పులులు చనిపోయాయి. జులై 2వ తేదీన ఏకంగా 20 కోతులు చనిపోయి కనిపించాయి. చామరాజనగర జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కోతులకు విషం పెట్టి చంపి ఉంటారని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మార్నింగ్ వాక్‌లో మహిళా ఎంపీ.. మెడలో చైన్ కొట్టేసిన దొంగ..
క్షుద్ర పూజలు చేస్తున్నాడని వ్యక్తిని చంపి.. అతడి ప్రైవేట్ పార్ట్‌ను..