Pocket Money For Children: పిల్లలకి ఏ వయసు నుంచి పాకెట్ మనీ ఇవ్వచ్చో తెలుసా?
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:17 PM
పిల్లలకి ఏ వయసు నుంచి పాకెట్ మనీ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అలా ఇవ్వడం మంచిదేనా? ఈ విషయం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల పెంపకంలో కొన్ని చిన్న విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వాటిలో పాకెట్ మనీ (Pocket Money) కూడా ఒకటి. చిన్న వయసులోనే డబ్బు విలువను అర్థం చేసుకోవడం, దాన్ని ఎలా ఖర్చు చేయాలో నేర్చుకోవడం వాళ్ళు భవిష్యత్తులో తెలివిగా వ్యవహరించేందుకు ఉపయోగపడుతుంది. అయితే, పిల్లలకి ఏ వయసు నుంచి పాకెట్ మనీ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలకి పాకెట్ మనీ ఏ వయసులో ఇవ్వాలనే దానికి ఒక నిర్దిష్ట వయస్సు లేదు, ఇది ప్రతి కుటుంబం అవసరాలు, పిల్లల మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, 7-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వచ్చు. ఈ వయస్సులో పిల్లలు చిన్న చిన్న విషయాల గురించి తెలుసుకోవడానికి, డబ్బు విలువను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
పాకెట్ మనీ వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు?
డబ్బు విలువ తెలుసుకుంటారు.
వారి చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడానికి పాకెట్ మనీ ఉపయోగపడుతుంది, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఏది కొనాలి, ఏది వద్దు అనేది తెలుసుకుంటారు. ఇలా సొంత నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అవుతుంది.
ఆదా చేయడం నేర్చుకుంటారు. అవసరంలేని ఖర్చులు తగ్గించుకోవడం అలవాటు అవుతుంది.
పాకెట్ మనీని ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించడం ద్వారా వారిలో బాధ్యత పెరుగుతుంది.
పాకెట్ మనీని ఎలా ఇవ్వాలి?
నెలలో ఒకే మొత్తంలో డబ్బు ఇవ్వడం మంచిది. కొన్ని పనులు పూర్తి చేసినందుకు పాకెట్ మనీ ఇవ్వడం, పిల్లలు బాధ్యతగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది. పాకెట్ మనీ గురించి పిల్లలతో మాట్లాడటం, డబ్బును ఎలా ఉపయోగించాలో నేర్పించడం చాలా ముఖ్యం. పాకెట్ మనీ ఇవ్వడం అనేది పిల్లలకు ఆర్థిక నైపుణ్యాలను నేర్పించడానికి ఒక మంచి మార్గం. ఇది వారిని మరింత బాధ్యతాయుతంగా, స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతుంది.
ఎంత ఇవ్వాలి?
ఇది పూర్తిగా మీ కుటుంబ పరిస్థితి, పిల్లల అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బు ఇవ్వకూడదని గుర్తించుకోండి. ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల పిల్లలు ఖర్చుపట్ల నిర్లక్ష్యంగా మారుతారు. అలా అని చాలా తక్కువ కూడా ఇవ్వొద్దు. ఎందుకంటే వారి చిన్న అవసరాలకైనా డబ్బు లేక ఇబ్బంది పడుతారు. అలాగే, మీరు వారు ఏ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారో గమనించాలి.
తల్లిదండ్రులు ఏమి చేయాలి?
పిల్లలతో డబ్బు గురించి మాట్లాడండి. అది ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి అన్నది వారికి నేర్పించండి. వారు చేసే ఖర్చులను గమనించండి. తప్పుగా ఖర్చు పెడితే ఆలస్యం చేయకుండా అర్థమయ్యేలా ప్రేమగా చెప్పండి. అవసరం అయితే పాకెట్ మనీ ఇచ్చే ముందు లేదా తర్వాత ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ చేయించండి .
పాకెట్ మనీ చిన్న విషయం కాదు. ఇది పిల్లలకి జీవితంలో ముఖ్యమైన గుణాలను నేర్పించే ఒక మంచి అవకాశం. సరైన దిశలో వాడితే ఇది వారికి భవిష్యత్తులో పెద్ద మేలు చేస్తుంది. నెలకి ఎంత ఇవ్వాలో నిర్ణయించుకునే ముందు పిల్లల వయసు, వారి అవసరాలు, మీ కుటుంబ పరిస్థితిని గమనించండి. అవసరమైతే, మొదట చిన్న మొత్తంతో మొదలుపెట్టి, పిల్లల వయస్సు పెరిగేకొద్దీ తగిన విధంగా పెంచండి.
ఇవి కూడా చదవండి:
వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా
పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..