UPI News Rules: యూపీఐ కొత్త రూల్స్.. నేటి నుంచి అమలులోకి!
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:51 AM
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నేటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కొన్ని మార్పులను అమలు చేయనుంది. UPIతో పాటు, మరికొన్ని ఆర్థిక మార్పులు కూడా చేయనుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్‌ఫేస్‌ను స్థిరంగా, సమర్థవంతంగా చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నేటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కొన్ని మార్పులను అమలు చేయనుంది. UPIతో పాటు మరికొన్ని ఆర్థిక మార్పులు కూడా అమలు చేయనుంది.
UPI లావాదేవీ నియమాలు
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యూపీఐ లావాదేవీల ప్రతిస్పందన సమయం తగ్గించేందుకు కొన్ని మార్పులు చేయాలని ప్లాన్ చేసింది. దీనిని వినియోగదారులకు తెలియజేయడానికి ఏప్రిల్‌లో ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది.ఈ మార్పులు ప్రధానంగా చెల్లింపులు పంపే బ్యాంకులు, చెల్లింపులు అందుకునే బ్యాంకులు, అలాగే ఫోన్ పే (PhonePe), గూగుల్ పే( Google Pay), పే టీఎం( Paytm) వంటి చెల్లింపు యాప్‌లకు సహాయపడడమే లక్ష్యంగా ఉన్నాయి. అంటే, మొత్తం వ్యవస్థను మరింత వేగంగా, సమర్థంగా పనిచేసేలా చేయడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం.
UPIలో ముఖ్యమైన మార్పులు:
బ్యాలెన్స్ చెక్ పరిమితి:
ఒక్కో యూపీఐ (UPI) యాప్‌లో మీరు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. మీరు ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు (ఉదాహరణకి: PhonePe, Google Pay, Paytm) వాడుతున్నా, ప్రతి యాప్‌లో 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేయడం కుదరదు. అంటే, మీరు మూడు యాప్‌లు వాడుతున్నట్లయితే, మొత్తం 150 సార్లు (ప్రతి యాప్‌కు 50 చొప్పున) చెక్ చేయవచ్చు. కానీ, ఒకే యాప్‌లో 50 సార్లు దాటితే అదనంగా బ్యాలెన్స్ చెక్ చేయలేం.
ఆటో-పే ట్రాన్సాక్షన్స్:
ఆటో-పే ద్వారా జరిగే చెల్లింపులు రద్దీ లేని సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. అంటే ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 తర్వాత. ఈ టైమ్స్‌లో మాత్రమే ఆటో-పే లావాదేవీలు ప్రాసెస్ చేయబడతాయి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అవి ప్రాసెస్ అవ్వవు.
ట్రాన్సాక్షన్ స్టేటస్ తనిఖీలు:
మీరు ఒక UPI ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అది పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం స్టేటస్ చెక్ చేస్తుంటాం. ఇప్పుడు NPCI ఇచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఒకే లావాదేవీకి ఎక్కువసారి చెక్ చేయడం కుదరదు. మీరు గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే స్టేటస్ చెక్ చేయొచ్చు. పైగా, ఒక్కోసారి చెక్ చేసే ముందు కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
లింక్డ్ ఖాతా తనిఖీలు:
UPI యాప్ (PhonePe, Google Pay, Paytm వంటి వాటి) ద్వారా మన బ్యాంక్ ఖాతాను యాప్‌తో లింక్ చేస్తాం. అప్పుడప్పుడూ మన ఖాతా వివరాలు లేదా బ్యాలెన్స్ చెక్ చేయాలంటే యాప్ మన లింక్డ్ ఖాతాను వెరిఫై చేస్తుంది. NPCI కొత్త నిబంధనల ప్రకారం, ఒక్కో యూపీఐ యాప్‌లో లింక్డ్ ఖాతా చెక్ చేసుకునే అవకాశం రోజుకు గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే ఉంటుంది.
లబ్ధిదారుడి పేరు ప్రదర్శన:
మీరు ఎవరికైనా డబ్బు పంపించే ముందు అంటే, వారి UPI ID లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే, ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి పేరు (బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన విధంగా) మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల లోపాలు, మోసాలు తగ్గుతాయి.
Also Read:
బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి హాని.!
బేకింగ్ సోడా Vs బేకింగ్ పౌడర్.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
For More Lifestyle News