Guinness World Record: ‘గిన్నిస్’లు వచ్చేస్తున్నాయ్... రికార్డులు సృష్టిస్తున్నాయ్..
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:30 AM
ఇప్పటిదాకా ప్రపంచ ప్రఖ్యాత ‘గిన్నిస్’ రికార్డుల కోసం వ్యక్తులు, కొన్ని సంస్థలు ప్రయత్నించడం తెలుసు. కానీ ఇప్పుడు... మనదేశంలోని ఆయా రాష్ట్రాలే రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదో ట్రెండ్‌గా మారింది. కొత్త కొత్త కార్యక్రమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
ఇప్పటిదాకా ప్రపంచ ప్రఖ్యాత ‘గిన్నిస్’ రికార్డుల కోసం వ్యక్తులు, కొన్ని సంస్థలు ప్రయత్నించడం తెలుసు. కానీ ఇప్పుడు... మనదేశంలోని ఆయా రాష్ట్రాలే రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదో ట్రెండ్‌గా మారింది. కొత్త కొత్త కార్యక్రమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. తాజాగా సరయూ నదీ తీరంలో కోట్లాది దీపాలు వెలిగించి ఉత్తరప్రదేశ్ రికార్డు సాధించిన సందర్భంగా... అలాంటి కొన్ని రికార్డులివి...
భారీ బతుకమ్మ
తెలంగాణలో అతి పెద్ద పూల పండుగ బతుకమ్మ. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలు 63 అడుగుల ఎత్తున్న భారీ బతుకమ్మను పేర్చారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం ఇందుకు వేదిక అయ్యింది. 63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఉన్న ఈ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల పూలను ఉపయోగించారు. 300 మంది మహిళలు మూడు రోజుల పాటు శ్రమించి ఈ బతుకమ్మను అందంగా పేర్చారు. ఇదొక రికార్డు అయితే... ఈ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడి మరొక రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క ‘గిన్నిస్’ ప్రతినిధుల నుంచి రికార్డు సర్టిఫికెట్ అందుకున్నారు.

భగవద్గీతా పఠనం...

వేదికపై ఒకేసారి 3740 మంది భగవద్గీతను చదవడం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ‘లాల్‌పరేడ్ గ్రౌండ్’ అందుకు వేదిక అయ్యింది. గత ఏడాది డిసెంబర్ 11న నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్’లో ఒకేసారి 3740 మంది భక్తులు భగవద్గీతలోని ‘కర్మయోగ’ చాప్టర్‌ను చదివారు. ఈ ఈవెంట్‌ని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమం ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ల్లో నమోదయ్యింది.

26 లక్షల దీపాల వెలుగులు...

దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఈ పండగ వేళ ‘దీపోత్సవం’ పేరుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో... అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. కొన్ని వేల మంది వాలంటీర్లు సరయూ నదీ తీరంలో 26.17 లక్షల దీపాలను వెలిగించారు. ఈ దృశ్యాన్ని డ్రోన్‌తో చూస్తే అయోధ్య నగరం దీపాల వెలుగుల్లో కళకళలాడుతూ కనిపించింది. ఎక్కువ నూనె దీపాలు వెలిగించినందుకు గానూ ‘గిన్నిస్’ రికార్డుల్లోకి ఎక్కింది. గత ఏడాది 25 లక్షల దీపాలు వెలిగిస్తే... ఈసారి మరో లక్ష దీపాలు పెరిగి, రికార్డును తిరగరాశారు. ఇదే వేడుకల్లో మరో గిన్నిస్ రికార్డు కూడా నమోదయ్యింది. సరయూ నదీ తీరంలోనే 2128 మంది కలిసి నిర్వహించిన హారతి కార్యక్రమం కూడా గిన్నిస్‌లోకి ఎక్కింది. ఇందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ‘క్యూఆర్’ కోడ్‌ను కేటాయించడం ద్వారా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల సర్టిఫికెట్‌లను అందుకున్నారు.
కోటికి పైగా ఉత్తరాలు ...

సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాయడం మామూలే. విశేషమేమిటంటే... ఒకరు కాదు ఇద్దరు కాదు... అక్షరాలా ఒక కోటీ పదకొండు లక్షల మంది ఉత్తరాలు రాసి కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్‌టీ పన్నుల తగ్గింపు, మేక్ ఇన్ ఇండియా, హర్ ఘర్ స్వదేశీ- ఘర్ ఘర్ స్వదేశీ వంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్‌వాసులు పోస్టుకార్డులు రాశారు. ఉద్యమంలా సాగిన పోస్టుకార్డుల రాత పని ఏకంగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ల్లోనూ స్థానం సంపాదించుకుంది. గతంలో ఈ రికార్డు స్విట్జర్లాండ్‌లోని ‘స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ కో ఆపరేషన్’ సంస్థ పేరిట ఉండేది. అప్పట్లో 6666 పోస్టు కార్డులు రాశారు. తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అదేవిధంగా 2021 మంది ఒకేసారి భుజంగాసనం వేయడం ద్వారా కూడా గుజరాత్ ప్రభుత్వం మరో ‘గిన్నిస్’ను సొంతం చేసుకుంది. ఈ ఆసనంలో వారంతా 2 నిమిషాల 9 సెకన్ల పాటు ఉండటం విశేషం.
దసరా కార్నివాల్

దసరా ఉత్సవాలకు విజయవాడ ప్రసిద్ధి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో మొదటిసారి ‘గ్రాండ్ దసరా కార్నివాల్’ను నిర్వహించారు. ఈ కార్నివాల్‌లో 3 వేల మంది కళాకారులు సంప్రదాయ దుస్తులతో, కొన్ని వందల మంది డ్రమ్ ఆర్టిస్టులు కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకను వీక్షించేందుకు లక్షల్లో జనం హాజరయ్యారు. దాంతో ఈ కార్నివాల్ ‘గిన్నిస్’ రికార్డుల్లోకెక్కింది. లంబాడీ నృత్యం, కాళికా ఫోక్ డ్యాన్స్, కేరళ డ్రమ్స్, తీన్‌మార్, కథాకళి, థింసా, టైగర్ డ్యాన్స్, కోలాటం, గొరిల్లా డ్యాన్స్, అఘోరా, డప్పు నృత్యాలతో సంప్రదాయ దసరా ఉత్సవాలు మిన్నంటాయి. ‘ఈ కార్నివాల్ ఒక పండుగ మాత్రమే కాదు. సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనం’ అని నిర్వాహకులు ప్రకటించారు.
అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ‘ఆవిష్కరణ ఆంధ్ర’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కేవలం 24 గంటల్లో 1.67 లక్షల మంది పారిశ్రామికవేత్తలు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ అరుదైన కార్యక్రమం కూడా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ల్లో స్థానం సంపాదించింది. ‘ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇక ‘ఇంటర్నేషనల్ యోగా డే’ సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 3 లక్షల 105 మంది పాల్గొన్నారు. ఇది అరుదైన ఫీట్‌గా ‘గిన్నిస్’ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రికార్డు సందర్భంగా వైజాగ్ బీచ్ రోడ్‌లో 26 కిలోమీటర్ల మేర దారంతా యోగా ప్రేమికులతో నిండిపోయింది.
అలాగే 61 వేల ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎమ్) నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ‘గిన్నిస్’ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘గిన్నిస్’ ప్రతినిధుల లెక్క ప్రకారం 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, టీచర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వాలంటీర్లు, అధికారులు, విద్యార్థులు, స్కూల్ కమిటీలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్‌లు కలిపి మొత్తంగా 1.5 కోట్ల మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నారు.
57 లక్షల వ్యాసాలు

అసోమ్‌లో జరిగిన వ్యాసరచన కార్యక్రమం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారెవరైనా. అసోమ్ జనరల్ లచిత్ బోర్ఫుఖాన్ 400వ జయంతి సందర్భంగా అక్కడి ప్రభుత్వం వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన గురించి వ్యాసం రాసి పంపమని కోరితే... ప్రపంచం నలుమూలల నుంచి ఆయన గుణగణాలు, ధైర్యసాహసాలను వర్ణిస్తూ 57 లక్షల మంది వ్యాసాలు రాసి పంపారు. అందులో చేత్తో రాసిన 42,94,350 వ్యాసాలను మాత్రమే గిన్నిస్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ‘లార్జెస్ట్ ఆన్‌లైన్ ఫొటో ఆల్బమ్ ఆఫ్ హ్యాండ్‌రిటెన్ నోట్స్’గా వీటిని గిన్నిస్ ప్రతినిధులు గుర్తించారు. అసోమ్ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ ‘గిన్నిస్’ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
సాహో... ‘ఖజురహో’...
139 మంది ఔత్సాహిక నృత్య కళాకారులు విరామం లేకుండా 24 గంటల 9 నిమిషాల 26 సెకన్ల పాటు డ్యాన్స్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ‘ఖజురహో’లో జరిగిన 51వ ‘ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్’లో ఈ రికార్డు నమోదైంది. కథక్, భరతనాట్యం, కూచిపూడి, మోహినీఅట్టం, ఒడిస్సీ నృత్యాలను కళాకారులు ప్రదర్శించారు. ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 2.34కి ప్రారంభమైన నృత్యం మరుసటి రోజు మధ్యాహ్నం 2.43 వరకు కొనసాగింది. 139 మంది నృత్యకారులు 18 గ్రూపులుగా ఏర్పడి ప్రదర్శన ఇచ్చారు. ఈ డ్యాన్స్ ఈవెంట్ ‘గిన్నిస్’ వరల్డ్ రికార్డుల్లో నమోదయ్యింది.
ఇంజనీరింగ్ అద్భుతం
పైన మెట్రో, మధ్యలో ఫ్లైఓవర్, కింద రహదారి... నగరాల్లో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాలంటే ఇలా ఉండాల్సిందే. మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్‌లో ఇలాంటి డబుల్‌డెక్కర్ వయాడక్ట్‌నే నిర్మించింది. ఈ నిర్మాణం అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్‌గా గుర్తింపు పొందింది. దీని పొడవు 5.62 కి.మీ. సింగిల్ పిల్లర్‌పై నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఫస్ట్ లెవెల్‌లో హైవే, రెండో లెవెల్‌లో మెట్రో, గ్రౌండ్ లెవెల్‌లో పాత జాతీయ రహదారి ఉంటుంది.