Share News

U.S. Labor and Immigration policy: వర్క్‌ పర్మిట్ల ఆటో రెన్యువల్‌కు అమెరికా స్వస్తి

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:37 AM

అమెరికాలో వలస కార్మికుల వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్‌ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ...

U.S. Labor and Immigration policy: వర్క్‌ పర్మిట్ల ఆటో రెన్యువల్‌కు అమెరికా స్వస్తి

  • ఆ దేశంలో ఉన్న వేలాది మంది

  • భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, అక్టోబరు 30: అమెరికాలో వలస కార్మికుల వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్‌ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. వలస విధానాలను మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ట్రంప్‌ యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది. అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో మెజారిటీ వాటా కలిగిన వేలాది మంది భారతీయ ఉద్యోగులను ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈఏడీ పునరుద్ధరణ కోసం అక్టోబరు 30, ఆ తర్వాత దరఖాస్తు చేసేవలసదారులకు ఇకపై ఆటోమేటిక్‌ రెన్యువల్‌ వర్తించదని డీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది. ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)ను పొడిగించే ముందు వలస కార్మికుల నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించడంతో పాటు వారి సోషల్‌ మీడియా ఖాతాలను జల్లెడ పట్టేందుకు ఈ నూతన నిబంధనను అమలులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇమిగ్రేషన్‌ మోసాలను అరికట్టడానికి, జాతి ప్రయోజనాలకు భంగం కలిగించేవారిని గుర్తించి, దేశం నుంచి బహిష్కరించడానికి తాజా నిబంధన వీలు కల్పిస్తుందని పేర్కొంది. బైడెన్‌ ప్రభుత్వంలో వలస కార్మికుల వర్క్‌ పర్మిట్‌ గడువు ముగిసినప్పటికీ, దాని పునరుద్ధరణ కోసం సకాలంలో రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసి ఉంటే వారు 540 రోజుల పాటు ఉద్యోగంలో కొనసాగడానికి అనుమతించేవారు. ఇప్పుడు దీని స్థానంలో తాజా నిబంధన అమలు కానుంది. ఈ నేపథ్యంలో వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 03:37 AM