Share News

UK Voting Age: ఓటు హక్కు వయోపరిమితిని తగ్గించేందుకు సిద్ధమైన యూకే.. ఇక 16 ఏళ్లకే..

ABN , Publish Date - Jul 17 , 2025 | 10:42 PM

ఎన్నికల్లో ఓటేసేందుకు కనీస వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంది.

UK Voting Age: ఓటు హక్కు వయోపరిమితిని తగ్గించేందుకు సిద్ధమైన యూకే.. ఇక 16 ఏళ్లకే..
UK voting age 16 reform

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో ఓటు వేసే పౌరుల కనీస వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల వ్యవస్థలో మార్పులను ప్రధాని కీర్ స్టార్మర్ ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనలపై పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే బ్రిటన్ మిలిటరీలో 16, 17 ఏళ్ల వయసున్న వారు సేవలందిస్తున్నారు. కాబట్టి, ఈ వయసుల్లో వారికీ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో అవకాశం కల్పిస్తూ న్యాయం చేయాలని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్కాట్‌లాండ్, వేల్స్‌లో 16 ఏళ్ల వయసున్న వారు ఓటు వేయచ్చు. బ్రిటన్‌లో మాత్రం కనీస వయోపరిమితి 18 ఏళ్లుగా ఉంది.

‘ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాలుపంచుకునేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. మరింత మందికి బ్రిటన్ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాలు పంచుకునే అవకాశం ఉండాలి’ అని డిప్యూటీ ప్రధాని యాంజెలా రెయినర్ వ్యాఖ్యానించారు.


ఇక ఓటర్ గుర్తింపు కార్డుకు సంబంధించి సంస్కరణలను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్యాంక్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, వెటరన్ కార్డుల డిజిటల్ కాపీలను కూడా ఓటర్ గుర్తింపు కార్డులుగా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రిజిసర్ట్ కాని సంస్థలు 500 పౌండ్లకు మించి ఇచ్చే రాజకీయ విరాళాలపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. రాజకీయ విరాళాలకు సంబంధించిన నిబంధనల్లో లొసుగులను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. డొల్ల కంపెనీల విరాళాలపై కూడా ఆంక్షలకు సిద్ధమైంది.


ఇక 18 ఏళ్ల వారి కంటే 16 ఏళ్ల వారు తమ తొలి ఓటును వేసేందుకు ఉత్సాహం చూపుతారని హస్ ఆఫ్ కామన్స్ సభ లైబ్రరీ పరిశోధనలో తేలింది. అయితే, ఎన్నికల ఫలితంపై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదని తేల్చింది. ప్రస్తుతం అర్జెంటీనా, ఆస్ట్రియా, బ్రెజిల్, క్యూబా, మాల్టా, ఎక్వడార్, నికరాగ్వా దేశాల జాతీయ ఎన్నికల్లో ఒటేసేందుకు కనీస వయో పరిమితిని 16 ఏళ్లుగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్

ఉద్యోగుల పెళ్లికి 10 రోజులు వేతనంతో కూడిన సెలవు.. ప్రభుత్వం ప్రకటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 10:54 PM