Share News

UK Company - Cyberattack: సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్

ABN , Publish Date - Jul 22 , 2025 | 10:20 AM

158 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ బ్రిటన్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సైబర్ దాడికి బలైపోయింది. డాటా మొత్తం పోవడంతో మరో దారి లేక కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా 700 మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.

UK Company - Cyberattack: సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్
KNP Logistics cyberattack

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ దాడి కారణంగా ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూతపడింది. ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు కారణంగా 158 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ కంపెనీ తెరమరుగైపోయింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది (KNP Logistics cyberattack).

బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టు కంపెనీ కేఎన్‌పీ లాజిస్టిక్స్‌ది సుదీర్ఘ చరిత్ర. ఈ సంస్థ సుమారు 500 లారీలను నిర్వహించేది. అయితే, సంస్థలోని ఓ ఉద్యోగి తన కంపెనీ అకౌంట్‌కు సంబంధించి వీక్ పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవడంతో పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. అకిరా అనే సైబర్ గ్యాంగ్.. ఈ పాస్‌వర్డ్‌ను సులువుగా గెస్ చేసి సంస్థ ఐటీ వ్యవస్థలోకి చొరబడింది. ఆ తరువాత సంస్థకు చెందిన డాటా మొత్తాన్ని ఉద్యోగులు వినియోగించుకోలేని విధంగా ఎన్‌క్రిప్ట్ చేసింది. ఈ డాటా మళ్లీ యథాతథంగా అందుబాటులోకి రావాలంటే తాము కోరిన మొత్తాన్ని ఇచ్చి డీక్రిప్షన్ కీ తీసుకోవాలని కోరింది.


కానీ సంస్థ యాజమాన్యం వద్ద అంత డబ్బు లేకపోవడంతో చేతులెత్తేసింది. చివరకు సంస్థ మూతబడింది. అందులోని 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని పోగొట్టుకున్నారు. అయితే, వీక్ పాస్‌వర్డ్ సెట్ చేసిన ఉద్యోగికి మాత్రం సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని ఇప్పటివరకూ చెప్పలేదు. ‘తెలియక చేసిన పొరపాటుతో ఇలాంటి దారుణం జరుగుతుందని ఎవరూ అనుకోరు. ఆ ఉద్యోగి తట్టుకోలేరు. అందుకే చెప్పలేదు’ అని సంస్థ యాజమాన్యం మీడియాతో తెలిపింది.

ఇటీవల కాలంలో బ్రిటన్‌లోని అనేక ప్రముఖ సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొన్నాయి. అయితే, ఇవేవీ కొత్త విధానాల్లో జరిగిన సైబర్ దాడులు కావని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సభ్యుడొకరు తెలిపారు. బలహీన సెక్యూరిటీ వ్యవస్థలున్న సంస్థలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్ వర్డ్స్ నుంచి పాస్ కీలవైపు మళ్లాలని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత

ప్రముఖ అమెరికన్ టీవీ షోకు ముగింపు.. తెగ మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 11:17 AM