US truck driver law: అమెరికాలో ట్రక్కు డ్రైవర్లు ఆంగ్లం మాట్లాడాల్సిందే
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:00 AM
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లంతా తప్పనిసరిగా ఆంగ్లంలో మాట్లాడాల్సిందేనని ట్రంప్ ఆదేశించారు. ఈ నిర్ణయం సిక్కు సంఘాల నుంచి తీవ్ర నిరసనలకు కారణమైంది.

ప్రజలు, దేశ భద్రత కోసమే నిర్ణయం
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్
మా ఉపాధికి ముప్పు: సిక్కు సంఘాలు
వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. సదరు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తనకున్న ఎగ్జిక్యూటివ్ అధికారాలతో హుకుం జారీ చేశారు. దేశంలోని వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లందరూ ఆంగ్లంలో మాట్లాడాల్సిందేనని, ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల భద్రత, దేశ రక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయమేనని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ‘‘వృత్తిరీత్యా డ్రైవర్లుగా ఉన్నవారికి ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండాలి. ఈ విషయంపై ఎలాంటి చర్చలకూ తావులేదు.’’ అని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ట్రంప్ తన ఆదేశాల్లో ఆంగ్లాన్ని జాతీయ అధికారిక భాషగా పేర్కొన్నారు. అంతేకాదు.. భాష అమలు విషయంలో గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇప్పటి నుంచి ఈ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని ఫెడరల్ ఏజెన్సీలను సైతం ఆదేశించారు. తాజా ఆదేశాలతో ఆంగ్లం మాట్లాడని డ్రైవర్లకు పోలీసులు భారీ జరిమానాలు విధించే అవకాశం కలగనుంది. గత ఒబామా పాలనలో 2016లో ఆంగ్లం మాట్లాడని డ్రైవర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నిషేధం విధించారు. ఇప్పటివరకు అది అమల్లో ఉంది. ట్రంప్ నిర్ణయంపై సిక్కు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం తమ పట్ల వివక్షను చూపించడమేనని, ఉపాధిని దెబ్బతీయడమేనని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో లక్ష మందికి పైగా సిక్కులు ట్రక్కు డ్రైవర్లుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..