Donald Trump Dance: మలేషియాలో ట్రంప్‌కు ఘన స్వాగతం.. కళాకారులతో కలిసి తన స్టైల్లో స్టెప్పులేసిన ప్రెసిడెంట్
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:47 PM
ఆసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన అక్కడి కళాకారులతో కలిసి స్టెప్పులేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎనభై ఏళ్లు వస్తున్నా తనలో ఉత్సాహానికి లోటేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించారు. దాదాపు 23 గంటల విమాన ప్రయాణం తరువాత ఎయిర్‌పోర్టులో దిగగానే ఆయన తన దైన శైలిలో స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి (Donald Trump dance Malaysia).
వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజులపాటు ఆసియా దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాజాగా మలేషియాకు వెళ్లారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. ఆయనను ఆహ్వానించేందుకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. మరోవైపు మలేషియా కళాకారులు తమ సంప్రదాయ నృత్యంతో ట్రంప్‌కు స్వాగతం పలికారు. దీంతో, ట్రంప్ కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. బీట్‌కు తగ్గట్టుగా ఉత్సాహంతో చేతులు కదుపుతూ తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. ఆయనతో కలిసి మలేషియా ప్రధాని కూడా డ్యాన్స్ చేశారు. దీంతో, అక్కడున్న వారందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి (Trump Kuala Lumpur arrival dance).
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. ట్రంప్ మరోసారి తన మార్కు స్టెప్పులతో ఆకట్టుకున్నారని అన్నారు. ట్రంప్ ఉత్సాహానికి వయసుతో నిమిత్తం లేదని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఆసియా టూర్లో భాగంగా ట్రంప్ మలేషియాతోపాటు జపాన్, దక్షిణ కొరియాల్లోనూ పర్యటిస్తారు. మలేషియాలో ఆసియాన్ దేశాల కూటమి సమావేశంలో పాల్గొంటారు. ఆ తరువాత జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రధానితోనూ భేటీలో పాల్గొంటారు. దక్షిణ కొరియాలో అపెక్ కూటమి దేశాధినేతల సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
కెనడాపై అదనపు సుంకం.. భారీ షాకిచ్చిన ట్రంప్
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి