Share News

Donald Trump: ప్రపంచానికి ట్రంప్ వార్నింగ్.. మాతో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే..

ABN , Publish Date - Jul 29 , 2025 | 10:36 AM

తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలపై కనీస సుంకం 15 శాతం నుంచి 20 శాతం వరకూ ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సుంకాల విధింపునకు సంబంధించి ఆగస్టు 1 డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో ఈ కామెంట్స్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Donald Trump: ప్రపంచానికి ట్రంప్ వార్నింగ్.. మాతో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే..
Trump tariff threat

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక జారీ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై గంపగుత్తగా 15 నుంచి 20 శాతం మేర సుంకాలు విధిస్తామని అన్నారు. ‘ప్రపంచదేశాలకు నేను చెప్పేది ఇదే.. సుంకాలు 15 శాతం నుంచి 20 శాతం వరకూ ఉండొచ్చు’ అని ట్రంప్ స్కాట్‌లాండ్‌లో యూకే ప్రధానితో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో హెచ్చరించారు.

గతంలో ట్రంప్ కనీస సుంకాన్ని 10 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతకుముందు కామర్స్ సెక్రెటరీ హావర్డ్ లట్నిక్ కూడా స్పందిస్తూ చిన్న దేశాలపై 10 శాతం సుంకం మాత్రమే విధిస్తామని పేర్కొన్నారు. లాటిన్ అమెరికా దేశాలు, కరీబియన్ దేశాలు, ఆఫ్రికాలోని పలు ఇతర దేశాలకు పది శాతం సుంకం వర్తిస్తుందని పేర్కొన్నారు.


తాజా ప్రకటనలో ట్రంప్ రూటు మార్చారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలన్నిటిపై ఒకే సుంకం విధిస్తామని అన్నారు. తాజా హెచ్చరికతో చిన్న దేశాలపై పెను భారం పడనుంది. కనీస సుంకం 10 శాతంగానే ఉంటుందని అనేక దేశాలు ఆశించాయి. కానీ ట్రంప్ తాజా ప్రకటనతో ఈ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

ట్రంప్ గతంలో ప్రకటించిన డెడ్‌లైన్ ఆగస్టు 1తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. డెడ్ లైన్ సమీపిస్తున్నందున ఎక్కువ డీల్స్ చేసుకోవాలన్న ఒత్తిడి తమపై ఏమీ లేదని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ఇక, అమెరికాతో చర్చలు జరుపుతున్న బృందానికి భారత్ తరపున రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత బృందం వాషింగ్టన్‌లో చర్చలు కొనసాగిస్తోంది. ఇక అమెరికాకు జపాన్ ఎగుమతి చేసే ఉత్పత్తులపై ట్రంప్ గతవారం 15 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఇండోనేషియాపై 16 శాతం సుంకాన్ని విధించారు. ఇక బ్రెజిల్‌పై ఏకంగా 40 శాతం, లావోస్‌పై 50 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి:

యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 11:19 AM