Share News

Tesla Autopilot Crash: టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు

ABN , Publish Date - Aug 02 , 2025 | 09:44 AM

2019 నాటి రోడ్డు ప్రమాదంలో బాధితులకు 242 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని టెస్లా సంస్థను ఫ్లోరిడా న్యాయస్థానం జ్యూరీ ఆదేశించింది. టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యం కూడా ఈ ప్రమాదానికి ఓ కారణంగా తేల్చింది. అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని టెస్లా పేర్కొంది.

Tesla Autopilot Crash: టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
Tesla Autopilot Crash Florida Compensation

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ విఫలం కావడం ఓ వ్యక్తి మృతికి దారి తీసిందని ఫ్లోరిడా కోర్టు జ్యూరీ తాజాగా పేర్కొంది. 2019 జరిగిన ఈ ప్రమాదంలో బాధితులకు పరిహారం కింద టెస్లా కంపెనీ 242 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

కీలార్గో అనే ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మీడియా కథనాల ప్రకారం, జార్జ్ మెక్‌‌గీ ప్రయాణిస్తున్న టెస్లా కారు ఓ షెవర్లే స్పోర్ట్స్ యూటిలిటీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నైబెల్ బీనావైడ్స్ లియో మరణించగా ఆమె బాయ్‌ఫ్రెండ్ డిలియన్ అంగులో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తరువాత మృతురాలి కుటుంబం, ఆమె బాయ్‌ఫ్రెండ్ న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసులో కోర్టు జ్యూరీ తాజాగా తీర్పు వెలువరించింది.


ఈ ప్రమాదానికి కారణం టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యమని తేల్చింది. తప్పు చేసినందుకు జరిమానాగా 200 మిలియన్ డాలర్లు, మృతురాలి కుటుంబానికి పరిహారంగా 59 మిలియన్ డాలర్లు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు 70 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ ప్రమాదానికి టెస్లా ఆటో పైలట్ వైఫల్యం పాక్షిక కారణం కాబట్టి మొత్తం 242 మిలియన్‌‌లుగా జ్యూరీ నిర్ణయించింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాధితులు ఎట్టకేలకు తమకు న్యాయం దక్కిందని అన్నారు.

అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని టెస్లా తరపు లాయర్లు పేర్కొన్నారు. ఈ తీర్పు తప్పని తేల్చి చెప్పారు. టెస్లా సంస్థతో పాటు ఈ రంగంలోని అభివృద్ధికి జ్యూరీ తీర్పు గొడ్డలి పెట్టు అని అన్నారు. ప్రమాద సమయంలో కారు డ్రైవర్ తన ఫోన్‌పై దృష్టి పెట్టినట్టు ఆధారాల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. అతడి పాదం కారు యాక్సెలరేటర్‌పై ఉండటంతో ఆటో పైలట్‌కు కారుపై నియంత్రణ లేకుండా పోయిందని తెలిపారు. నాటి కార్లతో పాటు ఇప్పుడున్న ఏ కారూ ఇలాంటి ప్రమాదాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ

భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 10:11 AM