Sunita Williams Post Mission Recovery: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 07:46 AM
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు నాసా వైద్యుల పర్యవేక్షణలో మరిన్ని కొన్ని రోజులు ఉండనున్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను కూడా వారు నాసా అధికారులతో పంచుకుంటారు. వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు నాసా అనుమతిస్తుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇన్నాళ్లుగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్రూ కాప్సూల్ ఫోరిడా తీరానికి సమీపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతా, బుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు (Sunita Williams Post Mission Recovery).
తొలుత సునీతా, బుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం స్ట్రెచ్చర్లపై తరలిస్తారు. ఐఎస్ఎస్‌లోని సూక్ష్మస్తాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..
ఇక ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా గమనిస్తారు. వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని నానా వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే కుటుంబసభ్యులు వారిని కలుసుకునేందుకు అనుమతిస్తారు.
ఇక అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను కూడా నాసా రికార్డు చేయనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు వంటివన్నీ తెలుసుకుని నాసా అధికారులు రికార్డు చేసుకుంటారు. చివరిగా వ్యోమగాములను తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇస్తారు.
భూమ్మీదకు వచ్చాక తాను ముందుగా కుటుంబసభ్యులతో పాటు పెంపుడు శునకాలను కూడా చూడాలనుకుంటున్నట్టు సునీతా విలియమ్స్ ఇటీవల పేర్కొన్నారు. గతేడాది బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Read Latest and International News