Share News

Protests in Nepal: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు.. కర్ఫ్యూ విధింపు

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:26 PM

నేపాల్‌లో మళ్లీ యువత నిరసనల బాట పట్టింది. బారా జిల్లాలో సీపీఎన్-యూఎమ్ఎల్ నేతలు స్థానిక యువతపై దాడి చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.

Protests in Nepal: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు..  కర్ఫ్యూ విధింపు
Nepal Gen Z protests,

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో యువత మరోసారి నిరసనల బాట పట్టడంతో కలకలం రేగుతోంది. బారా జిల్లాలోని సిమారా చౌక్‌లో యువత నిరసనలకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ తరువాత కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ఫవాయువు ప్రయోగించినట్టు కూడా తెలిసింది. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు కూడా కొంత సేపు నిలిచిపోయాయి (Protests Erupt Again in Nepal).

వచ్చే ఏడాది మార్చ్‌లో నేపాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీపీఎన్ యూఎమ్ఎల్ పార్టీ నేతలు కొందరు బుధవారం బారా జిల్లాకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తమపై యూఎమ్ఎల్ నేతలు దాడి చేశారని జెన్ జీ ఉద్యమ నేత ఒకరు ఆరోపించారు. తమపై అకారణంగా దాడి చేసిన వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ యువత గురువారం నిరసనలకు దిగింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి కర్ఫ్యూ విధించారు. నేటి రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా, బుధవారం నాటి ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. మరోవైపు, యువత సమ్యమనం పాటించాలని నేపాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సుశీల కర్కీ కోరారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు కూడా సూచించారు.


సెప్టెంబర్‌లో తలెత్తిన జెన్-జీ నిరసనలతో కేపీ ఓలీ శర్మ సారథ్యంలోని యూఎమ్ఎల్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ నిరసనల్లో ఏకంగా 76 మంది కన్నుమూశారు. సోషల్ మీడియాపై బ్యాన్‌తో మొదలైన నిరసనలు చివరకు అసమర్థ, అవినీతిమయ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

మనీలాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్టు

రాష్ట్రపతిని కలువనున్న మందకృష్ణ.. ఎందుకంటే

Read Latest National News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 04:38 PM