Share News

Mark Carney: కెనడా ప్రధానిగా కార్నీ

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:21 AM

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ విజయం సాధించనట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ బెదిరింపులు, భారత్‌తో విభేదాల నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Mark Carney: కెనడా ప్రధానిగా కార్నీ

విజయం దిశగా లిబరల్‌ పార్టీ

కొనసాగుతున్న కౌంటింగ్‌..

ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమి అంగీకారం

ప్రభావం చూపని ఖలిస్థానీ

అనుకూల న్యూడెమోక్రటిక్‌ పార్టీ

అధ్యక్ష పదవికి జగ్మీత్‌ రాజీనామా

టొరంటో, ఏప్రిల్‌ 29: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో మార్క్‌ కార్నీ నేతృత్వంలోని అధికార లిబరల్‌ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తం 343 స్థానాలున్న కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 స్థానాలు అవసరం. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం, లిబరల్‌ పార్టీ 168 చోట్ల విజయం సాధించింది. ఇంకా ప్రత్యేక బ్యాలెట్లలోని ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఒకవేళ లిబరల్‌ పార్టీ మెజారిటీ సాధించనప్పటికీ మార్క్‌ కార్నీ మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కెనడా ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్‌ పార్టీ 134 చోట్ల విజయం సాధించింది, ఆ పార్టీ నేత పియరీ పోయిలివ్రా తాను పోటీ చేసిన స్థానంలో ఓటమి పాలయ్యారు. ఫ్లాంకోయిస్‌ బ్లాంకెట్‌ నేతృత్వంలోని బ్లాక్‌ క్యూబికాయిస్‌ పార్టీ 22 సీట్లు గెలిచి, మూడో స్థానంలో కొనసాగుతోంది.


జగ్మీత్‌ సింత్‌ నేతృత్వంలోని ఖలిస్థానీ అనుకూల న్యూడెమోక్రటిక్‌ పార్టీ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలిచింది. దాంతో జగ్మీత్‌ సింగ్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా సుంకాల యుద్ధం, కెనడాను యూఎ్‌సలో 51వ రాష్ట్రంగా చేర్చాలంటూ ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతున్న వేళ ఈ ఎన్నికలు అత్యధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్‌తోనూ కెనడాకు విభేదాలు కొనసాగుతున్నాయి. కాగా, మార్క్‌ కార్నీ మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆ దేశం కెనడాకు చేసిన నమ్మక ద్రోహం షాక్‌కు గురిచేసిందని చెప్పారు. అమెరికా తమకు చేస్తున్న ద్రోహాన్ని ఎప్పటికీ మరచిపోవద్దని, పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. కెనడియన్లు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 05:22 AM