Mali Kidnappings: ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. అల్ ఖైదా అనుబంధ ఉగ్రమూకల దారుణం
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:57 AM
ఆఫ్రికా దేశం మాలీలో పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న ఉగ్రమూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశం మాలీలో ఐదుగురు భారతీయులను ఉగ్రమూకలు కిడ్నాప్ చేశాయి. ఇది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న మూకల పనేనని అక్కడి వార్గాలు చెబుతున్నాయి (Al qaeda linked Terror Groups). స్థానికంగా ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టు చేపడుతున్న సంస్థలో ఆ ఐదుగురు పనిచేస్తున్నారు. వారు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని సంస్థ ధ్రువీకరించింది. రాజధాని బొమాకోలోని మిగతా భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ విషయంపై అక్కడి ఉగ్రవాద సంస్థలు ఏవీ ఇంకా స్పందించలేదు (Indians Kidnapped in Mali).
మాలీలో ప్రస్తుతం మిలటరీ జంటా పాలన సాగుతోంది. మరోవైపు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రమూకలు దేశంలో రణరంగం సృష్టిస్తున్నాయి. వారికి అడ్డుకట్ట వేయలేక సైన్యం నానా కష్టాలు పడుతోంది. అసలే ఆర్థికకష్టాల్లో ఉన్న దేశంలో అంతర్గత కుమ్ములాటలు పరిస్థితిని నానాటికీ దిగజారుస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ జేఎన్ఐఎమ్ ఉగ్రసంస్థ దేశంలోకి ఇంధనం రాకుండా అడ్డుకోవడంతో అవస్థలు తీవ్రమయ్యాయి. మాలీలో విదేశీయుల అపహరణలు నిత్యకృత్యంగా మారాయి.
వర్గాల మధ్య కుమ్ములాటలతో మాలీ 2012 నుంచి అల్లకల్లోలంగా మారింది. సెప్టెంబర్‌లో కూడా జేఎన్ఐఎమ్ ఉగ్రవాదులు విదేశీయులను కిడ్నాప్ చేశారు. యూఏఈకి చెందిన ఇద్దరిని, ఒక ఇరాన్ దేశస్థుడిని బొమాకోకు సమీపంలో కిడ్నాప్ చేశారు. 50 మిలియన్ డాలర్లు ఇచ్చాక వారిని విడిచిపెట్టారు.
ఇవి కూడా చదవండి:
డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత
షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి