Lakshmi Mittal: పన్ను పోటు.. పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్ బ్రిటన్‌ను వీడారా?
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:59 AM
ఆర్సెలర్ మిత్తల్ సంస్థ అధినేత, బ్రిటన్ అపరకుబేరుడు లక్ష్మీ మిత్తల్ దేశాన్ని వీడినట్టు సమాచారం. అక్కడి ప్రభుత్వం సంపన్నుల నుంచి పన్నులను ముక్కు పిండి వసూలు చేస్తుండటంతో అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మిత్తల్ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచడంతో అపరకుబేరులు అల్లాడిపోతున్నారు. అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. తాజాగా ఆర్సెలర్‌మిత్తల్ స్టీల్ సంస్థ వ్యవస్థాపకుడు, అపరకుబేరుడు లక్ష్మీ మిత్తల్ దేశాన్ని వీడి స్విట్జర్‌ల్యాండ్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించడానికి ముందే ఆయన దేశాన్ని వీడారట. స్విట్జర్‌ల్యాండ్‌లో ఆయన ట్యాక్స్ రెసిడెంట్‌గా కొనసాగనున్నారని సమాచారం (Lakshmi Mittal).
ఎందుకీ వలసలు
ఇటీవల కాలంలో లేబర్ పార్టీ ప్రభుత్వం సంపన్నులపై పన్నుల భారం భారీగా పెంచింది. బ్రిటన్‌లో వారసత్వంగా అందించే ఆస్తిపాస్తులపై ప్రస్తుతం 40 శాతం పన్ను విధిస్తున్నారు. అయితే, దీని నుంచి తప్పించుకునేందుకు సంపన్నులు ఇప్పటివరకూ తమ ఆస్తులను విదేశీ ట్రస్టుల్లో పెట్టేవారు. తద్వారా అవి ట్రస్టు ఆస్తులని, వ్యక్తిగతం కావని చెప్పి పన్ను భారం నుంచి తప్పించుకునేవారు. ఈ మార్గానికి ప్రభుత్వం ఇటీవల చెక్ పెట్టింది. విదేశీ ఆస్తులన్నిటికీ ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. దీనికి తోడు.. బ్రిటన్ వీడాలనుకునే అపరకుబేరులపై ఎగ్జిట్ టాక్స్ కింద 20 శాతం పన్ను విధించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఖరీదైన స్థిరాస్తులపై పన్నులు విధించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంపన్నులు బ్రిటన్‌ను వీడుతున్నారట.
రాజస్థాన్‌లో జన్మించిన మిత్తల్.. బ్రిటన్‌లో 8వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. కింగ్ ఆఫ్ స్టీల్‌గా ఆయనకు పేరు. ఆయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ పౌండ్లు. ఆర్సెలర్‌మిత్తల్‌లో ఆయన కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. లండన్‌లో మూడు ఖరీదైన భవనాలు కూడా ఆయనకు ఉన్నాయి. స్టీల్ తయారీలో అనుభవం ఉన్న కుటుంబంలో పుట్టిన మిత్తల్ ఆ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అనేక దేశాలకు విస్తరించారు. ప్రస్తుతం భారతీయ ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 104వ స్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి..
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
Read Latest International And Telugu News