Japan Mt Shinmoedake: జపాన్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం.. ఆ జోస్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:37 PM
జపాన్‌లోని ఓ అగ్నిపర్వతం బద్దలై పొగలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం చూసి అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రముఖ చిత్రకారిణి ఒకరు చెప్పిన జోస్యం నిజమై తమను సునామీ ముంచెత్తొచ్చని ఆందోళన చెందుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని షిన్మోడాకే అగ్నిపర్వతం బద్దలు కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసిపడటం ప్రారంభించాయి. కొన్ని వేల మీటర్ల ఎత్తు వరకూ పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు తాజాగా ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్నిపర్వతం సమీపానికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆదేశించారు. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం, అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ 3 వేల మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. 2011 తరువాత ఇలా జరగడం ఇదే తొలిసారి (Japan Mt Shinmoedake Eruption).
మరోవైపు, గత రెండు వారాలుగా అక్కడి కగొషీమా ప్రిఫెక్చర్‌లో వెయ్యికి పైగా భూప్రకంపనలు సంభవించాయి. దక్షిణ క్యూషూలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో శనివారం కూడా భూకంపం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
ఓవైపు, భూప్రకంపనలు, మరోవైపు అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. వీటిని రాబోయే ప్రకృతి విపత్తులకు సంకేతాలుగా భావించి భయాందోళనలకు గురవుతున్నారు. రోయో టాట్సూకీ రూపొందించిన మాంగా కార్టూన్‌లో పేర్కొన్న జోస్యం నిజం కాబోతోందని టెన్షన్ పడిపోతున్నారు.
ఏమిటీ జోస్యం..
రోయో టాట్సూకీ అనే చిత్రకారిణి 1999లో తన మాంగా కార్టూన్‌లో జపాన్‌ను సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు. ఆ జోస్యం 2011లో నిజం కావడంతో రోయో పాప్యులారిటీ పెరిగిపోయింది. ఇక 2021లో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్‌లను విడుదల చేసిన ఆమె 2025 జులైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు. సునామీ ముంచెత్తుతుందని అన్నారు.
ప్రస్తుతం ఆ తరుణం రావడంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వెలుగు చూస్తుండటంతో జనాలకు టెన్షన్ మొదలైంది. అయితే, తనకు భవిష్యత్తును దర్శించే శక్తులేమీ లేవని ఆ చిత్రకారిణి ఇటీవల ప్రకటన కూడా విడుదల చేసింది. అయినా కానీ జనాల్లో మాత్రం టెన్షన్ తగ్గట్లేదు.
ఇవీ చదవండి:
జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..
అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి