NDP Loses in Canada: కెనడాలో ఖలిస్థానీ అనుకూల పార్టీకి భారీ షాక్
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:18 PM
ఖలిస్థానీ అనుకూల నేత, ఎన్‌డీపీ పార్టీ అధినేత జగ్‌మీత్ సింగ్‌కు తాజా కెనడా ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో జగ్‌మీత్ ఓటమి చెందనగా ఎన్‌డీపీ జాతీయ హోదా కోల్పోయే స్థితికి చేరుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాకు చెందిన ఖలిస్థానీ అనుకూల నేత, న్యూడెమాక్రెటిక్ పార్టీ చీఫ్ జగ్‌మీత్ సింగ్‌కు తాజా ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన పార్టీ పగ్గాలనూ వదులుకున్నారు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని బర్నబీ సెంట్రల్ సీటులో తనకు వరుసగా మూడో విజయం దక్కుతుందనుకున్న జగ్‌మీత్ చివరకు ఓటమి చవి చూశారు. ప్రత్యర్థి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థి వేడ్ ఛాంగ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. సింగ్‌కు 27 శాతం ఓట్లు రాగా వేడ్‌కు 40 శాతం ఓట్లు దక్కాయి. ఇక సింగ్ సారథ్యంలోని ఎన్‌డీపీకి కూడా ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య రెండంకెలను దాటే అవకాశం లేకపోవడంతో జాతీయ హోదా కూడా కోల్పోనుంది. కెనడాలో 12 సీట్లు గెలచుకున్న పార్టీకి జాతీయ హోదా దక్కుతుంది.
ఈ ఫలితాలపై సింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ‘‘ఇది పార్టీ అభిమానులకు నిరాశ కలిగించేదే. ఈ విషయం నాకూ తెలుసు. మెరుగైన కెనడా కల సాకారం కాదన్న ప్రత్యర్థుల మాటలను నమ్మిన రోజూ అసలైన ఓటమి. ఇది కాదు’’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మరిన్ని సీట్లు రానందుకు కాస్త విచారంగా ఉన్నా తాము పోరాడిన విధానంపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. భయం కంటే ఆశావాహ దృక్పథాన్నే తాను ఎల్లప్పుడూ ఎంచుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన స్ఫూ్ర్తివంతమైన వ్యాఖ్యలను కూడా షేర్ చేశారు.
ప్రధాని మార్క్ కార్నీ సారథ్యంలోని లిబరల్స్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అక్కడి మీడియా ఇప్పటికే ప్రకటించింది. అయితే, లిబరల్స్ పూర్తి మెజారిటీ సాధిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీ 147 స్థానాల్లో లీడ్‌లో ఉండగా లిబరల్స్ 164 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. హౌస్ ఆఫ్ కామన్స్ సభలో 172 సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. జస్టిన్ ట్రూడో తప్పుకున్న తరువాత కార్నీ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో ఆయన కెనడా, బ్రిటన్‌లో సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా సేవలందించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ పాలియేవర్.. ప్రధాని అయ్యే అవకాశాన్ని ఈ సారి కోల్పోయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా సభలో అడుగుపెట్టే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వి కూడా చదవండి:
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Latest Telugu News and International News