Hezbollah Attack: హెజ్‌బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ టార్గెట్‌గా బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:43 PM
హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆదివారం జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. సంస్థకు చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ తబ్తాబాయ్‌ను టార్గెట్ చేస్తూ రాజధాని బీరుట్ నగరంపై ఆదివారం దాడి జరిపింది. ఈ దాడిలో సుమారు ఐదురుగు మృతి చెందారు. 24 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు (Israel Airstrike on Beirut).
బీరుట్‌కు సమీపంలోని ఓ సబర్బన్ ప్రాంతంలో దాడి చేసింది. ఈ ప్రాంతంపై హెజ్‌బొల్లాకు గట్టి పట్టుందని భావిస్తారు. ఇజ్రాయెల్ దాడితో ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు వణికిపోయారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
హెజ్‌బొల్లా సైనిక శక్తి బలోపేతానికి ప్రయత్నిస్తున్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ తబ్తాబాయ్ టార్గెట్‌గా తమ దళాలు ఈ దాడి చేశాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మరణించారో లేదో అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అలీ తబ్తాబాయ్‌ని కీలక మిలిటెంట్ లీడర్‌గా అమెరికా ట్రెజరీ 2016లో ప్రకటించింది. ఆయన సమాచారం ఇచ్చిన వారికి 5 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ హెజ్‌బొల్లా మళ్లీ ఆయుధాలను, సైన్యాన్ని పెంచుకుంటోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా హెజ్‌బొల్లాపై జరిపిన దాడుల్లో పలువురు సీనియర్ కమాండర్లు కన్నుమూశారు. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హెజ్‌బొల్లా తోసిపుచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. బోర్డర్ వద్ద సైన్యం కదలికలకు లెబనాన్ ఆర్మీనే కారణమని చెబుతోంది.
ఇవి కూడా చదవండి..
సింథటిక్ డ్రగ్స్ మహా ప్రమాదం
చైనాలో పెరిగిన పెళ్లిళ్ల సంఖ్య.. ప్రభుత్వ వర్గాల్లో హర్షం
Read Latest International And Telugu News