Iran Proxy Crisis: ఒంటరైన ఇరాన్
ABN , Publish Date - Jun 24 , 2025 | 05:23 AM
ఒకపక్క ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది! మరోవైపు.. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో మెరుపుదాడి చేసింది!! ఇంత జరుగుతుంటే.. ఇరాన్ పాలుపోసి పెంచి పోషించిన, ఆ దేశ ప్రాక్సీలుగా పేరొందిన...

కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని హెజ్బొల్లా, హమాస్, ఇరాక్ మిలీషియా
వాటన్నింటినీ పెంచి పోషించింది ఇరానే!
టెహ్రాన్, జూన్ 23: ఒకపక్క ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది! మరోవైపు.. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో మెరుపుదాడి చేసింది!! ఇంత జరుగుతుంటే.. ఇరాన్ పాలుపోసి పెంచి పోషించిన, ఆ దేశ ప్రాక్సీలుగా పేరొందిన హూతీలు (యెమెన్), ఇరాక్ మిలీషియా, హెజ్బొల్లా (లెబనాన్), హమాస్ (పాలస్తీనా) ఉగ్రవాదులు ఏమైపోయారు? ఇరాన్‌కు అండగా నిలవాల్సిన సమయంలో మౌనంగా ఎందుకుండిపోయారు? ఇరాన్‌ను ఒంటరిగా ఎందుకు వదిలేశారు? పాలస్తీనాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా.. అత్యంత శక్తిమంతమైన సైనిక, రాజకీయ శక్తులు. ఇక.. హూతీల సంఖ్య తక్కువేగానీ.. ఎర్రసముద్రంలో అంతర్జాతీయ నౌకాయానంపై వారి పట్టు ఎక్కువ. కానీ.. కష్టకాలంలో ఉన్న ఇరాన్‌కు ఇప్పుడు వీరెవ్వరి మద్దతూ కనుచూపుమేరలో కానరాకపోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఎన్నో దశాబ్దాలుగా ఇరాన్ నిర్మించుకుంటూ వస్తున్న వ్యూహాత్మక బంధాలు పతనమైపోయాయని పశ్చిమాసియాలో వాషింగ్టన్‌కు చెందిన దౌత్య వ్యవహారాల నిపుణుడు ఫిరాస్ మక్సద్ తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిన ఇరాన్‌ను 1979 నుంచి నడిపిస్తున్నది ఆ దేశ రక్షణ సిద్ధాంతాలే. ఇరాక్‌తో యుద్ధం తర్వాత.. ఇరాన్ తన బలం పెంచుకోవడానికి వందల కోట్ల డాలర్లు వెదజల్లి వేలాది ఆయుధాలను కొనుగోలు చేసింది. పలు దేశాల్లో ప్రాక్సీ సైన్యాలను ఏర్పాటు చేసింది. అవన్నీ బలంగా ఉండి.. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగితే ఇరాన్ ఇప్పుడింత దయనీయస్థితిలో ఉండేది కాదు. కానీ.. 2020లో అమెరికా డ్రోన్ స్ట్రైక్‌లో ఇరాన్‌కు చెందిన అత్యున్నతస్థాయి భద్రత, నిఘా అధికారి.. ఇరాన్ ప్రాక్సీల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న కమాండర్ ఖాసిం సులేమానీ చనిపోయాడు! అతడు లేని లోటును ఇరాన్ ఇప్పటికీ పూడ్చుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.
ఇరాన్ ముసుగు సంస్థలైన హెజ్బొల్లా, హూతీ, హమాస్‌లను సులేమానీ.. ఒకదాంతో మరొకదానికి సంబంధం లేకుండా వికేంద్రీకరణ విధానంలో నిర్వహించేవాడు. కానీ, అతడి స్థానంలో వచ్చిన కమాండర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో అన్నీ సంస్థలూ బలహీనమైపోయాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ఇది ఇజ్రాయెల్‌కు అలుసుగా మారిందని.. ఆ దేశం ఈ ప్రాక్సీలను లక్ష్యంగా చేసుకుందని వారు వివరించారు. 2023, అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడి చేయడంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులను, అటు లెబనాన్‌లో హెజ్బొల్లా అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. మరోవైపు.. సిరియాలో ఇరాన్‌కు అనుకూలుడైన అసద్ ప్రభుత్వం కూలిపోయింది. హెజ్బొల్లాకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఇరాన్ సిరియా గుండానే అందజేసేది. కానీ, సిరియాలో అసద్ సర్కారు పతనంతో ఆ అవకాశం లేకుండా పోయింది. అసలే ఇజ్రాయెల్ దెబ్బకు కుదేలైన హెజ్బొల్లా.. ఇరాన్ ఆర్థిక సాయం లేక తీవ్రంగా బలహీనపడింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్ వరుసదాడులతో బాగా బలహీనపడింది. ఈ క్రమంలోనే..ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేస్తుంటే ఆ రెండు సంస్థలూ సాయానికి ముందుకు రావట్లేదు. హెజ్బొల్లా తాము కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం సాకుతో.. ఇరాన్‌కు మొండి చెయ్యిచూపించింది. ఇక.. ఇరాన్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా కూడా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఇరాన్‌కు సాయం చేయట్లేదు. చేయాలని ఉన్నా.. ఆ దేశం ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధంలో పీకల్లోతు మునిగిపోయి ఉంది. అందుకే ఇరాన్ ఒంటరిదైపోయింది. మిగిలింది హూతీలు. నిజానికి వారు కూడా ఈ ఏడాది మే నెలలో అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎర్ర సముద్రం గుండా వెళ్లే అమెరికన్ నౌకలపై దాడులు చేయబోమన్నది ఆ ఒప్పందం సారాంశం. కానీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు అమెరికా నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించారు. అంటే.. ఇప్పుడు ఇరాన్‌కు కొద్దిగానైనా అండగా నిలిచింది, నిలుస్తున్నది.. వారే.