Indian woman China Harassment: అరుణాచల్ మాదే.. భారత పాస్‌పోర్టు చెల్లదు.. భారతీయురాలికి చైనాలో వేధింపులు
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:39 AM
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రం చైనా భూభాగమంటూ తన భారతీయ పాస్‌పోర్టును గుర్తించేందుకు అధికారులు నిరాకరించారని బాధిత మహిళ ఆరోపించింది. చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్‌పోర్టులో తనకు వేధింపులు ఎదురయ్యాయని భారతీయ మహిళ ఒకరు ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భూభాగమంటూ వారు తన భారతీయ పాస్‌పోర్టును గుర్తించేందుకు నిరాకరించారని పేమా వాంగ్ థాంగ్‌డోక్ అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ నుంచి జపాన్ వెళ్లే క్రమంలో నవంబర్ 21న ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలో ఆగినప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని ఎక్స్ వేదికగా వెల్లడించారు (Arunachal Pradesh Woman Harassed in Shanghai Airport).
ఎయిర్‌పోర్టులో అధికారులు తన పాస్‌పోర్టును తనిఖీ చేశారని పేమా వాంగ్ చెప్పారు. పాస్‌పోర్టులో తను పుట్టిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అని ఉందని అన్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, ఫలితంగా తన పాస్‌పోర్టు చెల్లదని ఎయిర్‌పోర్టు అధికారులు అన్నారని ఆరోపించారు. తన భారతీయ పౌరసత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించారని చెప్పారు. ఆ తరువాత తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, జపాన్‌కు వెళ్లే విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనను దాదాపు 18 గంటల పాటు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు కదలనీయలేదని ఆరోపించారు. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు, ఈస్ట్ చైనా ఎయిర్‌లైన్స్ స్టాఫ్ తనను హేళన చేశారని చెప్పారు. చైనా పాస్‌పోర్టు తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారని అన్నారు
ఎయిర్‌పోర్టులోని ట్రాన్సిట్ ఏరియాకే తనను పరిమితం చేశారని చెప్పారు. కనీసం ఆహారం కొనుక్కునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిస్థితిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా గంటల తరబడి ఇబ్బంది పెట్టారని అన్నారు. బ్రిటన్‌లోని తన ఫ్రెండ్ ద్వారా షాంఘాయ్‌లోని భారతీయ ఎంబసీని సంప్రదించాకే తనకు ఊరట లభించిందని చెప్పారు. భారతీయ అధికారుల జోక్యంతో అక్కడి నుంచి బయటపడినట్టు తెలిపారు. ఈ ఘటన భారత సార్వభౌమత్వానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ, ఇతర భారతీయ అధికారులను అభ్యర్థించారు. ఇక ఈ ఘటనపై భారత దౌత్య వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చెప్పుకునేందుకు చైనా గతంలో చేసిన ప్రయత్నాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను చైనా మార్చడంపై మే నెలలో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారదంటూ దీటుగా జవాబిచ్చింది.
ఇవి కూడా చదవండి..
క్రిప్టో పెట్టుబడులతో నష్టాలు.. ట్రంప్ కుటుంబ ఆస్తుల విలువ ఢమాల్
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
Read Latest International And Telugu News