Share News

NATO-India: రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్

ABN , Publish Date - Jul 17 , 2025 | 09:24 PM

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ చేసిన హెచ్చరికపై భారత్ స్పందించింది. ఇంధన దిగుమతుల విషయంలో ద్వంద్వం ప్రమాణాలు వద్దని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

NATO-India: రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్
India NATO Russia trade

ఇంటర్నెట్ డెస్క్: రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై రెండో దశ ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ మార్క్ రట్ చేసిన వార్నింగ్‌పై భారత్ స్పందించింది. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వొద్దని హితవు పలికింది. ‘ఈ విషయంలో మీడియాలో వార్తలు మా దృష్టికి వచ్చాయి. పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. ఇక దేశ ప్రజల ఇంధన అవసరాలకు మించిన ప్రాధాన్యం మాకు మరొకటి లేదని నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఈ దిశగా మార్కెట్‌లో ఉన్న అవకాశాలు, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాము. అయితే, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావివ్వకూడదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు (India Cautions NATO).

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాతో వాణిజ్యం కొనసాగించడంపై నాటో చీఫ్ బుధవారం బ్రెజిల్, చైనా, భారత్‌కు హెచ్చరిక చేశారు. వాణిజ్యం కొనసాగిస్తే రెండో దశ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యులతో చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మూడు దేశాలు దృష్టి సారించాలని అన్నారు.


ప్రస్తుతం రష్యాతో అత్యధికంగా ఇంధన వాణిజ్యం నెరపుతున్న దేశాల్లో ఐరోపా, నాటో దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. 2022 నుంచి ఐరోపా దేశాలు అత్యధిక స్థాయిలో రష్యా ఎల్ఎన్‌జీ, పైప్‌లైన్ గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నాయి. ఇక నాటో సభ్యదేశమైన తుర్కియే.. రష్యా చమురు ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా ఉంది. అయితే, రష్యా చమురు, సహజవాయు ఉత్పత్తుల దిగుమతులను 2027 నాటికల్లా తగ్గించాలని ఈయూ నిర్ణయం తీసుకుంది.


ఇక ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఇటీవల స్పందించారు. ఆంక్షల కారణంగా రష్యా ఇంధన సరఫరాలో అవాంతరాలు తలెత్తితే భారత ఇంధన అవసరాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో తీర్చుకునే అవకాశం ఉందని అన్నారు. ఒకప్పుడు 27 దేశాల నుంచి ఇంధన దిగుమతులు ఉండేవని, ప్రస్తుతం 40 దేశాల నుంచి భారత్ దిగుమతులు చేసుకుంటోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

ఉద్యోగుల పెళ్లికి 10 రోజులు వేతనంతో కూడిన సెలవు.. ప్రభుత్వం ప్రకటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 09:37 PM