Share News

TMT: భారత్, జపాన్ సారథ్యంలో భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు! విశ్వ రహస్యాలను ఛేదించేందుకు..

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:09 PM

విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారత్, జపాన్‌లు జట్టుకట్టాయి. హవాయ్ ద్విప సముదాయంలో ఓ భారీ టెలిస్కోప్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ టెలిస్కోప్ సాయంతో విశ్వంలో జీవం ఉనికిని కనుగొనే అవకాశం కూడా ఉంది.

TMT: భారత్, జపాన్ సారథ్యంలో భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు! విశ్వ రహస్యాలను ఛేదించేందుకు..
Thirty Meter Telescope

ఇంటర్నెట్ డెస్క్: విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారత్, జపాన్‌లు జట్టుకట్టాయి. అత్యాధునిక థర్టీ మీటర్ టెలిస్కోప్‌ను (టీఎమ్‌టీ) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కృష్ణ బిలాలు, నక్షత్ర మండలాల అధ్యయనంతో పాటు విశ్వంలో జీవం ఉనికిని కనుగొనేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది.

ఏమిటీ టెలిస్కోప్ ప్రత్యేకత

అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన టీఎమ్‌టీ ప్రాజెక్టులో భారత్‌, జపాన్‌తో పాటు అమెరికాకు చెందిన రెండు పరిశోధన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 30 మీటర్ల భారీ అద్దంతో కూడిన ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేస్తారు. 500 చిన్న మిరర్స్‌ను అత్యంత కచ్చితత్వంతో పేర్చి భారీ మిర్రర్‌ను ఏర్పాటు చేస్తారు. అద్దం ఎంత పెద్దగా ఉంటే అంత సుదూరాన ఉన్న దృశ్యాలను చూడగలుగుతామని జపాన్ నేషనల్ స్పేస్ పాలసీ కమిటీ వైస్ ఛైర్మన్ డా. సాకూ సునేటా తెలిపారు.

టెలిస్కోప్ సక్రమంగా పని చేయాలంటే చిన్న అద్దాలను పేర్చే క్రమంలో అత్యంత కచ్చితత్వం పాటించాలి. ఇందుకు అవసరమైన ఆప్టో మెకానికల్ సాంకేతికతను భారత్ సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ 2014లో ఆమోదం తెలిపింది. భారత్ తరపున ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (బెంగళూరు), ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (పూణె), ఆర్యభట్టా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ పాల్గొంటున్నాయి.


ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే..

హవాయ్‌ ద్విపసముదాయంలో 4000 మీటర్ల ఎత్తున్న మౌనా కియా పర్వతంపై ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అక్కడి గగనతలం నిర్మలంగా అంతరిక్ష అధ్యయనానికి అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావించే స్థానికులు టెలిస్కోప్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, స్థానికుల అనుమతితోనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని జపాన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెలిస్కోప్ నిర్మాణం కోసం లద్దాఖ్‌లోని హెన్లీ ప్రాంతంలో టెలిస్కోప్ ఏర్పాటు అంశాన్ని కూడా భారత్, జపాన్‌లు పరిశీలిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు 2035 నాటికల్లా పూర్తవుతుందని అంచనా. ఈ టెలిస్కోప్‌తో విశ్వంలో జీవం ఉనికిని కనుగొనగలిగితే మహాద్భుతం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్.. ఆస్ట్రేలియాను వీడుతున్న కంటెంట్ క్రియేటర్లు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 03:11 PM