Hong Kong Fire Tragedy: ప్రళయాగ్ని ప్రకోపం.. 44 మంది మృతి.. 279 మంది గల్లంతు
ABN , Publish Date - Nov 27 , 2025 | 07:18 AM
ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా మారింది హాంకాంగ్ భారీ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదాన్ని చూసి మానవాళి ఉలిక్కిపడుతోంది. ప్రతీ గంట.. గంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం, అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోవడం..
ఇంటర్నెట్ డెస్క్: హాంకాంగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పెద్ద హౌసింగ్ ఎస్టేట్‌ను ప్రళయాగ్ని చుట్టుముట్టింది. ఈ అగ్నిప్రమాదంలో 44మంది మృతిచెందగా.. 279 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ప్రమాదంతో 4,600మందికి పైగా అక్కడి నివాసితుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ కలవరపెడుతోంది. అగ్నికీలలు మొదలై 13 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. విచారకరం ఏమిటంటే.. స్థానికులను కాపాడేందుకు వచ్చిన పలువురు అగ్నిమాపక సిబ్బంది సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
హాంకాంగ్ తైపో జిల్లాలోని అపార్ట్‌మెంట్ (వాంగ్ ఫు కోర్ట్) బ్లాక్స్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో దాదాపు 5వేల మంది జనాభా ఉన్నారు. ఈ అపార్ట్‌మెంట్ సముదాయంలో మొత్తం 8 భవనాలున్నాయి. వీటిలో దాదాపు 4,600 మంది జనాభా నివశిస్తున్నారు. 700 మందికి పైగా అగ్నిమాపకసిబ్బంది ఈ భారీ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తూ అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రమాదంలో మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చాలా మంది భవనాల్లో చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు. అయితే ఎంతమంది ఉన్నారనేదానిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. హాంకాంగ్‌లో అత్యంత తీవ్రప్రమాదాలను గుర్తించే 'లెవల్ ఫైవ్'గా దీనిని పరిగణిస్తున్నారు. హాంకాంగ్‌లోని హౌసింగ్ సొసైటీ భవనాల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువ కావడంతో అగ్నిప్రమాదం ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. హాంకాంగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 51నిమిషాలకు మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. ప్రమాద స్థలంనుంచి కేవలం 500 మీటర్ల దూరంలో తాయ్ పో రైల్వేస్టేషన్ ఉంది.
అగ్నికీలలు సమీపంలోని భవనాలకు వ్యాపించడంతో పోలీసులు అక్కడి వెయ్యి మందిని ఖాళీ చేయించి, షెల్టర్లకు తరలించారు. చాలా రోడ్లు మూసివేశారు. 30కి పైగా బస్సు రూట్లు మళ్లించారు. ఈ కాంప్లెక్స్ సముద్ర తీరానికి, ప్రధాన రహదారికి దగ్గరగా ఉంది. ఇక్కడి ఫ్లాట్లు సాధారణంగా 400 నుంచి 500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. మరమ్మతు పనుల కోసం భవనాల బయట కట్టిన వెదురుబొంగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News