Bangladesh Lynching: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారిని హత్య చేసి మృతదేహంపై డ్యాన్స్.. నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:50 PM
బంగ్లాదేశ్‌లో జరిగిన మూకదాడిలో హిందూ వ్యాపారి మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో ఓ హిందూ వ్యాపారి మూకదాడిలో మరణించిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్టు చేసినట్టు హోమ్ అఫైర్స్ అడ్వైజర్ లెఫ్టెనెంట్ జనరల్ (రిటైర్డ్) జహాంగీర్ ఆలమ్ చౌదరి తెలిపారు. వ్యాపారి మృతి తరువాత దేశవ్యాప్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు వెల్లడించారు.
ఎన్నికల ముందు ఈ హత్య జరిగిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు చౌదరి తెలిపారు. వ్యాపారి హత్యను ఆయన ఖండించారు. అత్యంత విచారకరం, అమానవీయమని అన్నారు. ఇలాంటి చర్యలకు సభ్య సమాజంలో స్థానం లేదని తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. క్రిమినల్స్‌ను అస్సలు ఊపేక్షించబోమని హామీ ఇచ్చారు.
జులై 9న మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి ప్రాంతంలో లాల్ చంద్ అలియాస్ సొహాగ్‌ను కొందరు కాంక్రీట్ స్లాబ్స్‌తో కొట్టి దారుణంగా హత్య చేశారు. లాల్ చంద్ మరణించాడని నిర్ధారించుకున్నాక వారు మృతదేహంపై డ్యాన్స్ చేసినట్టు ఉన్న వీడియో వైరల్ కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ పైశాచికత్వానికి తెగ బడ్డ ప్రధాన నిందితుడు టిటాన్ గాజీ ప్రస్తుతం పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు. మరోవైపు, లాల్ చంద్ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. మూక హింసను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవిచ్ఛితురాలైన తరువాత దేశంలో మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే
ఇవీ చదవండి:
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. ఆరుగురు చిన్నారుల దుర్మరణం
అమెరికా FBIకి చిక్కిన ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి