Hamas Govt: గాజాపై ఇజ్రాయెల్‌భీకర దాడులు
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:41 AM
హమాస్ ప్రభుత్వం దాదాపుగా పతనమైంది..! గాజాపై సోమవారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 419 మంది మృతిచెందగా.. 660 మంది గాయాలపాలయ్యారు.

419 మంది మృతి.. అత్యధికులు పౌరులే మృతుల్లో హమాస్ ప్రధాని, మంత్రులు, పోలీసు చీఫ్ తదితరులు.. 660 మందికి గాయాలు
కాల్పుల విరమణకు అంగీకరించనందుకే ఈ దాడులు.. నెతన్యాహు వెల్లడి
టెల్‌అవీవ్, మార్చి 18: హమాస్ ప్రభుత్వం దాదాపుగా పతనమైంది..! గాజాపై సోమవారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 419 మంది మృతిచెందగా.. 660 మంది గాయాలపాలయ్యారు. వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల్లో హమాస్ ప్రధాని ఇసామ్ దాలిస్ సహా.. కీలక మంత్రులు, మిలటరీ/పోలీసు కమాండర్లు ఉన్నారు. ముందు నుంచి హమా్‌సకు సహకరిస్తూ వస్తున్న ‘ఇస్లామిక్ జిహాద్’ సంస్థ కీలక నేత అబూ హమ్జా కూడా ఈ దాడుల్లో అంతమైనట్లు ఇజ్రాయెల్ వార్తాసంస్థ యెదిహోత్ అహ్రొనోత్(వైనెట్) తెలిపింది. సౌదీ అరేబియా కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అల్-హదత్ కూడా హమాస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మరణాలను నిర్ధారించింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము అంగీకరించినా.. హమాస్ నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి వైమానిక దాడులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్‌లో పోస్టు చేశారు. పౌరులు తూర్పు గాజాను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇజ్రాయెల్ తమకు ముందుగానే సమాచారమిచ్చింద ని, ట్రంప్ ఓకే చెప్పాకే దాడులను ప్రారంభించిందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో 419 మంది మృతిచెందినట్లు నిర్ధారించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. గాజాలోని ఖాన్‌యూని్‌సతోపాటు.. రఫా, ఉత్తరగాజా, సెంట్రల్ గాజా సిటీలనే లక్ష్యంగా చేసుకుని సుమారు 200 విమానాలు దాడులకు పాల్పడ్డట్లు వివరించింది.
హమాస్‌కు భారీ నష్టం
ఇజ్రాయెల్ దాడులతో హమా్‌సకు కోలుకోలేని దెబ్బ తగిలింది. హనియే, సిన్వర్ వంటి హమా స్ అగ్రనాయకులు అంతమైనా.. వ్యూహాత్మక పోరాటాలకు సహకరిస్తున్న ఇస్లామిక్ జిహాద్ నేత అబూ హమ్జా తాజా దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. క్షిపణుల కమాండర్‌గా పనిచేస్తున్న హమ్జా భార్య, ఇతర కుటుంబ సభ్యులూ చనిపోయినట్లు తెలిపింది. ఇక హనియేకు కుడిభుజంగా ఉంటూ.. ఆయన మరణం తర్వాత హమాస్ ప్రధాని పదవిని చేపట్టిన ఇసామ్ డాలిస్, ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవరాళ్లు కూడా మృతిచెందారు. డాలిస్ మరణంతో హమాస్ దారితెన్నూ లేకుండా పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన సమయంలో ఇజ్ అద్-దీన్ అల్-ఖాసమ్ బ్రిగేడ్లకు సీనియర్ నేతగా.. రఫా బ్రిగేడ్‌కు డిప్యూటీ కమాండర్‌గా డాలిస్ పనిచేశారు. డాలిస్ మరణాన్ని ఆయన సోదరుడు ధ్రువీకరిస్తూ.. మంగళవారం అల్-జజీరాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
దాడుల్లో మృతి చెందిన ఇతర నేతలు
బహ్జత్ అబూ సుల్తాన్: ఈయన హమాస్ లెఫ్టెనెంట్ జనరల్. ఇజ్రాయెల్‌పై దాడుల్లో కీలకంగా వ్యవహరించారు
అహ్మద్ ఒమర్ అల్-హట్టా: హమాస్ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ.. ఇస్లామిక్ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించారు. గాజా అంతర్గత వ్యవహారాల ఇన్‌చార్జిగా కూడా కొనసాగారు. 2021 వరకు గాజాలోని ‘రబాత్ పోలీసు శిక్షణ కళాశాల’కు డీన్‌గా పనిచేశారు.
మహమ్మద్ అబూ వత్ఫా: హమాస్ పోలీసు, భద్రత విభాగాల అధిపతిగా.. అంతర్గత వ్యవహారాల డీజీగా సేవలందించారు. సెంట్రల్ గాజాలోని ఈయన ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. వత్ఫా కుటుంబమంతా చనిపోయింది.
యాసిర్ హర్బ్: ఈయన హమాస్ పాలిట్‌బ్యూరో సభ్యుడు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఈయన ఐదుగురు కుమారులు కూడా మరణించారని ఖతార్ వార్తాపత్రిక అల్-అరబీ అల్-జదీద్ వెల్లడించింది.
అబూ ఒబేదా మహమ్మద్ అల్-జమాసీ: ఈయన హమా్‌సలో మానవహక్కులను పర్యవేక్షించేవారు. పాలిట్‌బ్యూరో సభ్యుడు కూడా. దక్షిణ గాజాకు ప్రభుత్వాధినేతగా పనిచేశారు.