Stephen Harper: ఖలిస్థానీ వేర్పాటు వాద పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:21 PM
కెనడాలోని అన్ని రాజకీయ పార్టీలు ఖలిస్థానీ వేర్పాటువాద పార్టీలతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని మాజీ ప్రధాని హార్పర్ సూచించారు.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని రాజకీయ పార్టీలన్నీ ఖలిస్థానీ వేర్పాటువాద పార్టీలతో సంబంధాలను తెంచుకోవాలని దేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ పిలుపునిచ్చారు. బ్రాంప్టన్లో జరిగిన 5వ కెనడా ఇండియా చారిటీ గాలాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారత్తో కెనడా బంధం బలపడాలంటే అధికారంలోని పార్టీ.. ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఇండియాతో ముడిపడిన వివాదాలను కెనడాకు తీసుకుని రావాలనుకుంటున్న వారితో సంబంధాలు తెంచుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఆధునిక భారత దేశంలో చీలిక తేవాలనుకుంటున్న వారితో సంబంధాలు తెంచుకోవాలని పిలుపునిచ్చారు.
కెనడాలో, భారత సంతతి కెనేడియన్లలో, సిక్కు కెనెడియ్లలో కూడా ఖలిస్థానీ ఉద్యమానికి అంతగా మద్దతు లేదని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఖలిస్తానీల కోసం అంత సమయం ఎందుకు కేటాయిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. తన హయాంలో ఇలా ఉండేది కాదని చెప్పారు. ఆ విధానంవైపు ప్రస్తుత పార్టీలన్నీ మళ్లాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇటీవలి వివాదాలను పక్కన పెట్టి భారత్, కెనడా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. గత నవంబర్లో హార్పర్ దాదాపు ఇలాంటి కామెంట్స్ చేశారు. విచ్ఛిన్నకర బృందాలను ప్రోత్సహించరాదని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ మీడియా అండ్ ఈవెంట్స్ కోఆర్డినేషన్ సంస్థ మాజీ ప్రధానిని ఈ సందర్భంగా గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డుతో సత్కరించింది.
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనకాల భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో అనడంతో ఇరు దేశాల మధ్య వివాదం పతాకస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇవీ చదవండి:
నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
ట్రంప్, జీ మధ్య త్వరలో వాణిజ్య చర్చలు.. వైట్ హౌస్ ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి