Dubai Skyscraper: దుబాయ్ ఆకాశహర్మ్యంలో మంటలు.. 3820 మంది అపార్ట్‌మెంటు వాసుల తరలింపు
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:24 PM
దుబాయ్‌లోని ఓ భారీ ఆకాశహర్మ్యంలో శనివారం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు 3800 మంది అపార్ట్‌మెంటు వాసులను సురక్షిత ప్రాంతాలను తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లోని మరీనా ప్రాంతంలో 67 అంతస్తుల ఆకాశహర్మ్యంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అధికారులు ఈ భనవంలో ఉంటున్న సుమారు 3800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని అధికారులు తెలిపారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, టైగర్ టవర్ భవనంలో అగ్ని కీలలు ఎగసి పడ్డాయి. అయితే, దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు సుమారు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. భవనంలోని 764 అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్న 3820 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శనివారం ఉదయానికల్లా అపార్ట్‌మెంట్ వాసుల తరలింపు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేసేందుకు భవనం డెవలపర్‌తో కలిసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు.
ఈ భవనంలో 2015లో కూడా ఓసారి అగ్ని ప్రమాదం సంభవించింది. 47వ అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్ కిచెన్‌లో మంటలు చెలరేగి 48వ అంతస్తుకు వ్యాపించాయి. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలు త్వరగా అదుపులోకి తెచ్చారు. ఈ భవనానికి సమీపంలోని మరో ఆకాశహర్యంలో కూడా రెండు సార్లు అగ్నిప్రమాదం జరిగింది.
తాజా ఘటనలో మంటలను ఆర్పడంలో అధికారులు విజయం సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో వేగవంతమైన స్పందన కనిపించలేదని కొందరు అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. అసలు తమ భవనంలో మంటలు చెలరేగిన విషయమే తెలియదని కొందరు తెలిపారు. ఫైర్ ఇంజెన్లు వచ్చాకే అసలు విషయం అర్థమైందని అన్నారు. ఫైర్ అలార్మ్ లేకపోవడమో లేదా పనిచేయకపోవడమో జరిగి ఉండాలని మరికొందరు అన్నారు. ఇక కొందరు మాత్రం అగ్నిమాపక సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. వేగంగా స్పందించి ముప్పును తప్పించారని కితాబునిచ్చారు. మెట్ల మార్గంతో పాటు లిఫ్ట్‌ల ద్వారా అపార్ట్‌మెంట్ వాసులను భవనం నుంచి బయటకు తీసుకొచ్చారని అన్నారు.
ఇవీ చదవండి:
భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక
శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి