Share News

Donald Trump-Tariffs: సుంకాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ABN , Publish Date - Aug 01 , 2025 | 07:56 AM

70కి పైగా దేశాలపై సుంకాలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సుంకాలు మరో వారం తరువాత అమల్లోకి రానున్నాయి.

Donald Trump-Tariffs: సుంకాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Trump Executive Orders on Tariff Hike

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పలు దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70కిపైగా దేశాలపై 10 నుంచి 41 శాతం మధ్య సుంకాలను (టారిఫ్‌లు) విధిస్తూ శ్వేత సౌధంలో ఉత్తర్వులపై సంతకం చేశారు. వాణిజ్య లోటు కారణంగా టారిఫ్‌లు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు.

కొత్త టారిఫ్స్‌లో భాగంగా భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడాపై సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు. ఔషధాల అక్రమ దందాకు కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు.

ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల పెంపుపై అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే, ఈ పెంపు మరో వారం తరువాత అమల్లోకి రానుంది. ఇక పెంపునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆగస్టు 7 లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు ఆక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయి.


చైనాతో ఇంకా కుదరని ఒప్పందం

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయి ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోదముద్ర కూడా వేయాల్సి ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. చైనాపై సుంకాల విధింపునకు అమెరికా ఆగస్టు 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ వారం స్టాక్‌హోం వేదికగా జరిగిన చర్చల్లో చైనా డిమాండ్స్‌ను అమెరికా గట్టిగా వ్యతిరేకించినట్టు సమాచారం

భారత్‌తో డీల్ పరిస్థితి ఇదీ

భారత్‌తో ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్యంతో పాటు అనేక భౌగోళికరాజకీయ అంశాలు ఈ చర్చలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.


కొత్త టారిఫ్‌లు ఇవీ

  • 41% టారిఫ్: సిరియా

  • 40% టారిఫ్: లావోస్, మయన్మార్ (బర్మా)

  • 39% టారిఫ్: స్విట్జర్లాండ్

  • 35% టారిఫ్: ఇరాక్, సెర్బియా

  • 30% టారిఫ్: అల్జీరియా, బోస్నియా అండ్ హెర్జిగోవినా, లిబియా, సౌతాఫ్రికా

  • 25% టారిఫ్: భారత్, బ్రునై, కజకిస్తాన్, మాల్డోవా, ట్యునీషియా

  • 20% టారిఫ్: బాంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాం

  • 19% టారిఫ్: పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్

  • 18% టారిఫ్: నికరాగువా

  • 15% టారిఫ్: ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనా, ఇతర దేశాలు

  • 10% టారిఫ్: బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫాక్‌లాండ్ దీవులు

ఇవి కూడా చదవండి:

భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన

ప్రపంచానికి ట్రంప్ వార్నింగ్.. మాతో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 10:43 AM