Share News

China Marriages Increase: చైనాలో పెరిగిన పెళ్లిళ్ల సంఖ్య.. ప్రభుత్వ వర్గాల్లో హర్షం

ABN , Publish Date - Nov 22 , 2025 | 09:22 PM

చైనాలో పెళ్లిళ్ల సంఖ్య ఓ మోస్తరు స్థాయిలో పెరగడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. నానాటికీ పడిపోతున్న జనాభాతో టెన్షన్ పడుతున్న ప్రభుత్వం యువతను సంతానం కనేలా ప్రోత్సహించేందుకు రకరకాల చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా తీసుకున్న చర్యలు కొన్ని తక్షణ ఫలితాన్ని ఇచ్చాయి.

China Marriages Increase: చైనాలో పెరిగిన పెళ్లిళ్ల సంఖ్య.. ప్రభుత్వ వర్గాల్లో హర్షం
Increase in Marriages in China

ఇంటర్నెట్ డెస్క్: జనాభా తగ్గిపోతుండటంతో వణికిపోతున్న చైనా ప్రభుత్వానికి చాలా కాలం తరువాత ఓ గుడ్ న్యూస్ లభించింది. దేశంలో పెళ్లిళ్ల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చైనాలో ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో 5.2 మిలియన్ పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 4 లక్షల మేర అధికంగా వివాహాలు నమోదయ్యాయి (Increase in Marriages in China).

ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక చర్యతో తక్షణ ఫలితం కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తమ స్వస్థలంలోనే కాకుండా ఎక్కడైనా తమ వివాహాలను రిజిస్టర్ చేసుకునేలా నిబంధనలను సడలించడంతో యువతకు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు ఈజీగా మారాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి నిబంధనల సడలింపుతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వ పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తక్షణమార్పు కనిపించింది.

అయితే, పెళ్లి, పిల్లల్ని కనడం వంటి అంశాల్లో చైనా యువత తీరు ఇంకా మారలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం నిబంధనలను సడలించడంతోనే పెళ్లిళ్ల సంఖ్య పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. సంప్రదాయక పద్ధతులపై యువత అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు.


నానాటికీ పడిపోతున్న జనాభాతో చైనా ప్రభుత్వం ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అక్కడి మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1 కంటే తక్కువగా ఉంది. జనాభా స్థిరంగా ఉండాలంటే 2.1 రేటు అవసరం. పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే 2100 సంవత్సరం చైనా జనాభా ప్రస్తుతమున్న 1.4 బిలియన్‌ల నుంచి 653 మిలియన్‌లకు పడిపోయే అవకాశం ఉంది. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగి ప్రజారోగ్య వ్యవస్థపై, ప్రభుత్వం ఖజానాపై భారం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. దీంతో, యువతను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతోంది. మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తోంది.


ఇవి కూడా చదవండి...

నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు.. కర్ఫ్యూ విధింపు

మనీలాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్టు

Read Latest International And Telugu News

Updated Date - Nov 22 , 2025 | 10:24 PM