Canada Bill C-3: కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
ABN , Publish Date - Nov 24 , 2025 | 09:21 AM
పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పౌరసత్వ చట్టానికి కెనడా కీలక సవరణ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పౌరసత్వంపై పరిమితులు తొలగించేలా మార్పులు తీసుకొచ్చింది. బిల్ సీ-3 పేరిట ఈ చట్టాన్ని రూపొందించారు. విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వ సమస్యలు తాజా చట్టంతో చాలా వరకూ తొలగిపోతాయని కెనడా వలసల శాఖ మంత్రి లీనా డయాబ్ తెలిపారు (Canada Immigration Overhaul Bill c-3).
మునుపటి చట్టాల ప్రకారం, విదేశాల్లో పుట్టిన చిన్నారులు, లేదా దత్తత తీసుకున్న పిల్లలకు కెనడా పౌరసత్వం రావాలంటే వారి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు కెనడాలో జన్మించి ఉండాలి. లేదా కెనడాలోనే ఉంటూ పౌరసత్వం పొందిన వారై ఉండాలి. ఇలా విదేశాల్లో పుట్టి తల్లిదండ్రుల ద్వారా కెనడా పౌరసత్వం పొందిన కెనేడియన్లు మళ్లీ తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వాన్ని అందించే అవకాశం ఉండేది కాదు. అంటే.. ఇది కేవలం ఒక తరానికే పరిమితమయ్యేది. 2009లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ఒంటారియోలోని సుపీరియర్ కోర్టు 2023లో కొట్టేసింది. చట్ట సవరణకు ప్రభుత్వానికి కొంత గడువు కూడా ఇచ్చింది. ఇక ప్రభుత్వం కూడా ఈ తీర్పును అంగీకరించింది. ఈ మేరకు చట్టంలో మార్పు చేస్తూ బిల్ సీ-3ని తీసుకొచ్చింది. దీన్ని త్వరలో నోటిఫై చేయనున్నారు. అనంతరం, కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
ఈ చట్టం ప్రకారం, విదేశాల్లో పుట్టిన కెనేడియన్లు కూడా తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం వారు తమకు మాతృదేశంలో గట్టి బంధం ఉందన్న విషయాన్ని రుజువు చేసుకోవాలి. అంటే, విదేశాల్లో పుట్టిన కెనడా పౌరులు బిడ్డల్ని కనే ముందు కనీసం 1075 రోజుల పాటు కెనడాలో ఉండి ఉంటే వారి సంతానానికీ కెనడా పౌరసత్వం లభిస్తుంది. దత్తత సంతానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా కెనడా ఈ మేరకు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వస్తే భారత సంతతి వారికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
హెజ్‌బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ టార్గెట్‌గా బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి
Read Latest International And Telugu News