Airbus A320 Glitch: ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం
ABN , Publish Date - Nov 29 , 2025 | 10:40 AM
ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాంకేతిక లోపం బయటపడింది. సమస్యను చక్కదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000 విమానాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో పలు విమానయాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ ఏ320 విమానాల సర్వీసులను రద్దు చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 మోడల్ విమానాల్లో తాజాగా ఓ సాంకేతిక లోపం బయటపడింది. దీన్ని సరిదిద్దేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 వేల విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ఏ320 ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశాయి (Airbus A320 Glitch).
సాంకేతిక లోపానికి సంబంధించి విమానయాన సంస్థలను ఎయిర్‌బస్ అప్రమత్తం చేసింది. ముందుజాగ్రత్తగా తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అక్టోబర్‌లో జెట్‌బ్లూ విమానంలో ఈ లోపం బయటపడినట్టు తెలిపింది. సౌర తుపాన్లు తలెత్తిన సందర్భాల్లో ఈ లోపం కారణంగా ఫ్లైట్ నియంత్రణ వ్యవస్థలకు చెందిన డేటా పాడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభావిత విమానాల్లో కొత్త సాఫ్ట్‌వేర్, కొన్ని సందర్భాల్లో హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొన్నింటి సాఫ్ట్‌వేర్ మార్పునకు వారాల పాటు సమయం పట్టే ఛాన్స్ కూడా ఉందని సమాచారం. ఎయిర్‌బస్ తమకు ఇందుకు సంబంధించిన సమాచారం అందించిందని ఈయూ ఏవియేషన్ ఏజెన్సీ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు విమానయాన సంస్థలు కొన్ని ఫ్లైట్‌లను రద్దు చేశాయి. మరికొన్ని ప్రయాణాలను వాయిదా వేశాయి (Flight Disruptions).
సమస్య గురించి తెలిసింది ఇలా..
అక్టోబర్ 30న జెట్‌బ్లూ సంస్థకు చెందిన ఏ320 విమానంలో కంప్యూటర్ లోపం తలెత్తింది. ఫలితంగా విమానం నియంత్రణలో పైలట్‌లకు ఇబ్బంది ఎదురైంది. మెక్సికో నుంచి అమెరికాకు వస్తున్న సమయంలో మార్గమధ్యంలో విమానం అకస్మాత్తుగా కిందకు దిగింది. దీంతో పైలట్ను విమానాన్ని ఫ్లోరిడాలోని టాంపాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయాలపాలయినట్టు కూడా సమాచారం. ఆ తరువాత ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ అప్రమత్తమయ్యాయి. భారత విమానయాన సంస్థలపై కూడా ఈ ప్రభావం పడింది. ప్రస్తుతం భారత్‌లో ఏ320 చెందిన 560 విమానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో సుమారు 200 విమానాల్లో సాఫ్ట్‌వేర్ మార్పు అవసరమని తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా విక్రయించే విమానంగా ఏ320 ఫ్యామిలీ విమానాలు అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. 1988 నుంచీ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి