Migrant Boat Capsize: తీవ్ర విషాదం.. పడవ బోల్తా పడి 68 మృతి.. 74 మంది గల్లంతు..
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:29 AM
Migrant Boat Capsize: సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది.

యెమెన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో మునిగిపోయారు.
54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి. మరికొన్ని శవాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. ఆ శవాలను మార్చురీకి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళుతుంటారు. స్మగ్లర్లు వారిని పడవల ద్వారా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో పడవల్లో లెక్కకు మించి ఎక్కించుకుంటూ ఉంటారు. ఓవర్ లోడ్ కారణంగా ఆ పడవలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో వలసదారులు చనిపోతూ ఉంటారు. గత కొన్ని నెలల్లోనే వందల మంది వలసదారులు పడవ బోల్తాపడిన ఘటనల్లో చనిపోయారు. మార్చి నెలలో ఏకంగా నాలుగు బోట్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా.. 186 మంది గల్లంతయ్యారు. ఈ విషయాలను ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ స్వయంగా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ధీరజ్ కోట్ల కథా సాహిత్య పురస్కారాలు
తెరవని తలుపుల వెనుక దాగిన చీకట్లు