Vaccines for Adults: పెద్దలు వేసుకోవాల్సిన టీకాలు కూడా ఉన్నాయి! అవేంటో తెలుసా?
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:30 PM
పెద్దలకు కూడా కొన్ని టీకాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. వయసుతో పాటు రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు వైద్యులు సూచించిన టీకాలను పెద్దలు తప్పనిసరిగా వేసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: టీకాలు అంటే చిన్నతనంలో మాత్రమే వేసుకునేవని చాలా మంది అనుకుంటారు. అయితే, పెద్దయ్యాక కూడా కొన్ని టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి బలహీనపడటమే ఇందుకు కారణం. ఇక డయాబెటిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు కూడా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన టీకాలు వేసుకోవాలి. మరి పెద్దలు వేసుకోవాల్సిన టీకాలు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (Vaccines for Adults) .
నిపుణులు చెప్పేదాని ప్రకారం, సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధి నుంచి రక్షణ కోసం పెద్దలు ఏడాదికి ఒకసారి ఫ్లూ టీకా వేయించుకోవాలి. లేకపోతే ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య బారిన పడే అవకాశం ఉంది.
న్యూమోకొక్కల్ టీకాలను కూడా పెద్దలు వేసుకోవాలి. నిమోనియా మెనింజైటిస్‌తో పాటు రక్తంలో చేరే పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుంది.
టెటానస్, దిప్తీరియా, పర్చుసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు టీడీఏపీ టీకా వేసుకోవాలి.
ఇక పెద్దలకు వివిధ కారణాల రీత్యా హెపటైటిస్ ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి వారు హెపటైటిస్-బీ టీకా తీసుకోవడం మంచిది.
హెచ్‌పీవీ వైరస్ కారణంగా క్యాన్సర్‌ల బారిన పడకుండా ఉండేందుకు హెచ్‌పీవీ టీకా తీసుకోవడం కూడా అవసరం.
ఈ టీకాలను తీసుకుంటే తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదా అకాల మరణం ముప్పు తప్పుతుందని అంటున్నారు. పెద్దలకు వారి వయసును బట్టి టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, వైద్యులను సంప్రదిస్తే రోగుల నేపథ్యాన్ని అనుసరించి ఏయే టీకాలు వేసుకోవాలో సూచిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వైద్యులను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి
చుండ్రుతో బట్టతల? క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వైద్యుడు
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు