Eat Right After A Shower: స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?.. సైన్స్ ఏం చెబుతోంది?..
ABN , Publish Date - Dec 02 , 2025 | 09:32 PM
స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా? ఆరోగ్య సమస్యలు వస్తాయా?.. ఆయుర్వేదం ఏం చెబుతోంది?.. సైన్స్ ఏం అంటోంది?..
తినటం, స్నానం చేయటం అన్నది సాధారణంగా ప్రతీ మనిషి ప్రతీ రోజూ చేసే పనులే. చాలా మంది స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకుంటూ ఉంటారు. స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా? ఆయుర్వేదం ఏం చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోకూడదు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. స్నానం చేసిన తర్వాత శరీరం చల్లబడిపోతుంది. శరీరంలో అగ్ని ఉండదు. అలాంటి సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. తద్వారా కడుపులో వికారం, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి.
ప్రొటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తింటే సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే దాని ప్రభావం మెటబాలిజంపై పడుతుంది. బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే తిన్న తర్వాత అరగంటకు, స్నానం చేసిన తర్వాత అరగంటకు ఆహారం తీసుకోవాలి. ఆహారం తినే ముందు గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే మంచిది. అల్పాహారం తీసుకునే ముందు స్నానం చేస్తే అద్భుతమైన శక్తి లభించటంతో పాటు ఆ రోజంతా క్లారిటీతో ఉండొచ్చు.
మరి సైన్స్ ఏం చెబుతోంది?..
స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం లేదు. స్నానం చేయటం ద్వారా పడిపోయిన శరీర ఉష్ణోగ్రతల వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, స్నానం చేసిన తర్వాత హార్ట్ రేట్ స్వల్పంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కడుపునిండా ఆహారం తింటే కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. చల్లనీళ్ల స్నానం వల్ల కొంత సమయం వరకు మాత్రమే రక్త నాళాలు కుంచించుకుపోతాయి. వేడి నీళ్ల స్నానం చేస్తే పెద్దగా అవుతాయి. అయితే, చల్ల నీళ్ల స్నానం చేసినా.. వేడి నీళ్ల స్నానం చేసినా చిన్న ప్రేగు పోషకాలను గ్రహించటంలో ఎలాంటి ఆటంకం ఉండదు.
ఇవి కూడా చదవండి
పవన్‌పై తెలంగాణ నేతల ఫైర్.. జనసేన క్లారిటీ..
గగనతలాన్ని నిరాకరించ లేదు.. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్