Hot Showers- Male Fertility: పురుషులకు వేడి నీటి స్నానంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా?
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:19 PM
సంతానం పొందాలనుకుంటున్న పురుషులు వేడి నీటి స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వేడి నీటి స్నానానికి సంతానోత్పత్తి సామర్థ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: రోజంతా పనితో అలసిపోయాక సాయంత్రం వేడి స్నానంతో కలిగే సాంత్వన ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, వేడి నీటి స్నానంతో పురుషులకు నష్టం కలిగే ఛాన్స్ ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి (Hot Showers and Male Fertility).
వేడి నీరు, పురుషుల సాంతనోత్పత్తి సామర్థ్యానికి సంబంధం ఇదీ..
పురుషుల్లో వృషణాలు శరీరానికి వెలుపలు ఉంటాయి. ఇలాంటి ఏర్పాటు వెనుక ముఖ్య కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీర్య కణాల ఉత్పత్తికి తక్కువ ఉష్ణోగ్రత అవసరం కాబట్టి పురుషుల శరీర నిర్మాణం ఈ రీతిలో రూపుదిద్దుకుంది. ఉష్ణోగ్రత పెరిగితే వీర్య ఉత్పత్తి తగ్గుతుంది. ఇక వేడి నీటితో ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఉష్ణోగ్రత పెరిగి వీర్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిన పురుషుల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. తైవాన్లో దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరి వేడి నీటి స్నానాలు మానేయాలా?
పురుషులు పూర్తిగా వేడి నీటి స్నానాలు మానేయాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు భరోసా ఇస్తున్నారు. గోరు వెచ్చని నీటితో వీలైనంత తక్కువ సార్లు స్నానం చేస్తే రిస్క్ చాలా వరకూ తగ్గిపోతుందని చెబుతున్నారు. అడపాదడపా చేసే వేడి నేటి స్నానాలతో ముప్పు ఉండదని భరోసా ఇస్తున్నారు. కాబట్టి, నీరు ఎంత వేడిగా ఉంది? ఎన్ని సార్లు వేడి నీటి స్నానాలు చేస్తున్నారు? ఎంత సేపు స్నానం చేస్తున్నారు? అనే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని భరోసా ఇస్తున్నారు.
కాబట్టి తండ్రి కావాలనే పురుషులు ఈ విషయాలను మనసులో పెట్టుకోవాలి. సంతానోత్పత్తి సమస్యలు ఇతరత్రా అనారోగ్యాలకు కూడా దారితీస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు భరోసా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..