Vitamin D Deficiency: సూర్యరశ్మికి లోటే లేదు.. అయినా మెజారిటీ భారతీయుల్లో విటమిన్ డీ లోపం!
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:44 PM
దేశంలో అన్ని కాలాల్లో ఎండ ఉంటున్నా జనాల్లో విటమిన్ డీ తక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో సూర్యరశ్మికి లోటే లేదు. కానీ 70 నుంచి 90 శాతం మంది జనాలు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్టు ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో తేలింది. పోషకాల లేమికి సంబంధించి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదేనని కూడా వైద్యులు కామెంట్ చేస్తున్నారు (Vit D Deficiency in Indians - Reasons).
విటమిన్ డీలో వాస్తవానికి హార్మోన్ గుణాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం కాల్షియంను సమర్థవంతంగా గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. రోగ నిరోధక శక్తి, మెదడు ఆరోగ్యానికి విటమిన్ డీ కీలకం. సూర్యరశ్మిలోని యూవీబీ కిరణాల సాయంతో చర్మంలో విటమిన్ డీ తయారవుతుంది. ఇది తగ్గిన సందర్భాల్లో అలసట, నిరుత్సాహంగా ఉండటం, కండరాల నొప్పి, నిత్యం అనారోగ్యాల బారిన పడటం వంటివి కనిపిస్తుంటాయి.
విటమిన్ డీ లోపానికి కారణాలు..
సూర్యరశ్మి పుష్కలంగా లభించే భారత్‌లో విటమిన్ డీ లోపం అధికంగా ఉండటం ఆశ్చర్యకరమే అయినా ఇందుకు పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జనాలు రోజులో అధికభాగం నాలుగు గోడలకే పరిమితం కావడం ఈ సమస్యకు ముఖ్య కారణం. గాజు అద్దాల కిటీలు ఉన్నప్పటికీ ఇవి యూవీబీ కిరణాలను చాలా వరకూ నిరోధిస్తాయి. ఫలితంగా జనాల్లో విటమిన్ డీ లోపం తలెత్తుతోంది.
ఎస్‌పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లు కూడా యూవీబీ కిరణాలను 95 శాతం వరకూ అడ్డుకుంటాయి. దీంతో, చర్మంలో విటమిన్ డీ తయారీ తగ్గుతోంది.
కాలుష్యం కారణంగా గాల్లో పెరుగుతున్న సూక్ష్మ దుమ్మురేణువులు కూడా యూవీబీ కిరణాలను భూమిపైకి పూర్తిస్థాయిలో చేరకుండా చెల్లాచెదురు చేస్తున్నాయి. మెట్రోనగరాల్లో కాలుష్యం కారణంగా 60 శాతం మేర యూవీబీ కిరణాలు కిందకు చేరట్లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
యూవీబీ కిరణాలను చర్మంలోని మెలనిన్ కూడా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. చర్మం ముదురు రంగులో ఉండటానికి కూడా మెలనిన్‌యే కారణం. ఇక మెలనిన్ ఎక్కువగా ఉండే భారతీయులకు పూర్తిస్థాయిలో విటమిన్ డీ అందాలంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఒంటిపై ఎండ పడటం అవసరం. కానీ జనాలు ఇళ్లు, ఆఫీసులకు పరిమితం అయిపోయి విటమిన్ డీ లోపం బారిన పడుతున్నారు.
విటమిన్ డీ లోపంతో కేవలం ఎముకలు బలహీనపడటమే కాకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి రోగాల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే, రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో నిలబడితే విటమిన్ డీ లోపాన్ని సులువుగా అధిగమించొచ్చని నిపుణులు అంటున్నారు.